YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ రాజకీయం

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ రాజకీయం

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ రాజకీయం మారుతోంది. 2014 ముందున్న ఉద్రిక్తతల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాలకులు రాజకీయం కోసం వేస్తున్న ఎత్తులు, ఆధిపత్య పోరుతో ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిజంగా రెండు చోట్ల ఉన్న ప్రజలు శాంతస్వభావులు. వారికి ఉపాధి తప్ప మరేదీ అవసరం లేదు. కానీ ఏలికల ఆశలు ఆకాశానికి తాకడంతోనే సగటు జనానికి లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి. ఇక రాజకీయంగా విశేష అనుభవం ఉన్న కేసీఆర్ ఉద్యమ నేతగా ఉన్న కాలంలో ఆంధ్రులను బాగా నిందించారు. కానీ ఆయన తెలంగాణా సాధించాక అన్న మాటలు మాత్రం ఊరడింపుగానే ఉన్నాయి. రెండు రాష్టాలు అయినా కూడా అన్నదమ్ములుగా కలసి ఉందామని కేసీఆర్ నాడు చేసిన ప్రకటనను అంతా స్వాగతించారు.నవ్యాంధ్రాకు తొలి సీఎంగా పనిచేసిన చంద్రబాబు స్వార్ధ రాజకీయం కోసం ఉబలాటపడి ఓటుకు నోటుకు కేసులో చిక్కుకున్నారని చెబుతారు. దాన్ని సాకుగా తీసుకున్న టీయారెస్ ని చల్లారుస్తూ బాబు కేసీఆర్ తో రాజీ ఒప్పందం కుదుర్చుకున్నారు అని కూడా ప్రచారంలో ఉంది. ఆ తరువాత రాత్రికి రాత్రి విజయవాడకు వచ్చేసిన చంద్రబాబు 2024 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మీద ఉన్న హక్కులను పాతరేశారని విమర్శలు ఉన్నాయి. దాని ఫలితాలు, పర్యవశానాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ఏపీకి కచ్చితమైన రాజధాని అంటూ లేకుండా పోయింది. బంగారం లాంటి హైదరాబాద్ ని కాదనుకునే పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికీ ఏపీలో ఉన్న లక్షలాది మందికి హైదరాబాద్ ఒక ఉపాధి కేంద్రంగా ఉంది. బాబు నిర్ణయంతో అలా వారంతా ఒక్కసారిగా లోకల్ కాకుండా పోయారు.’దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిరుగుతాయి. దీని మీద ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, పైగా దేశమంతా ఒక్కటి అన్న భావనతో అంతా సాగుతారు. ఆరేళ్ళ క్రితం వరకూ ఒక్కటిగా ఉన్న రాష్టంలో ఇపుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే రెండు బస్సులు మారడం అంటే తెలుగు వారికే అవమానంగా ఉందని అంటున్నారు. దసరా వేళ పెద్ద సంఖ్యలో జనం హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తారు. కానీ వారంతా రాకపోకలు చేయడానికి బస్సులు ఈసారి లేవు. ఆంధ్రా నుంచి వచ్చిన ఆర్టీసీని తెలంగాణా సరిహద్దులో ఆపేశారు. దానికి కేసీఆర్ సర్కార్ పెట్టిన ఆంక్షలే కారణం. లక్షల కిలోమీటర్ల దూరం ఏపీ ఆర్టీసీ బస్సులు తెలంగాణా గడ్డ మీద తిరుగుతున్నాయని, వాటి వల్ల తమకు నష్టం అంటూ కొత్త వాదన గులాబీ ప్రభుత్వం పెద్దలు తీశారు. దాంతో చర్చలు ఎన్ని జరిగినా ఫలితం లేకుండా పోతోంది.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఏపీ నుంచి వచ్చిన వారే ఓటేయాలి. వారు మద్దతు ఇస్తేనే టీయారెస్ అయినా మరో పార్టీ అయినా గెలిచేది. మరి ఈసారి ఆంధ్రుల ఓట్ల రాజకీయం ఎలా ఉంటుందో చూడాల్సిందే. మాటకు కట్టుబడి ఆంధ్రులను గుండెల్లో పెట్టుకుంటామని చెప్పిన కేసీఆర్ సర్కార్ ఆచరణలో తేడాగా వ్యవహరిస్తోందని కానీ ఆంధ్ర ప్రజలు నమ్మితే మాత్రం రాజకీయం కొత్తగానే ఉంటుందని అంటున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో టీయారెస్ మోకాలడ్డే తీరు కూడా ఇపుడు చర్చకు వస్తోంది. మొత్తానికి ఏపీ, తెలంగాణా సామరస్యంగా ఉంటే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రాజకీయంగా ఎవరు ఆలోచనలు ఎలా ఉన్నా ప్రజల పరంగా ఒక్కటిగా ఉండే వివేచనను చూపించాలని అంతా కోరుతున్నారు.

Related Posts