YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న రైతులు విలవిల

కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న రైతులు విలవిల

ఆరుగాలం శ్రమించినా రైతుల స్థితిగతుల్లో పెద్దగా మార్పు రావడంలేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ఏటా నష్టపోతున్నారు. దీంతో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారి పంటను సేకరిస్తోంది. మద్దతు ధర అందిస్తూ రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తోంది. అయితే ఈ దఫా ఖమ్మం జిల్లాలోని మొక్కజొన్న పంట సేకరణను ప్రారంభించలేదు సర్కార్. దీంతో మొక్కజొన్న రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. సర్కారీ కొనుగోళ్లు లేకపోతే ప్రైవేట్ వ్యాపారులు, దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని, అదే జరిగితే తాము దారుణంగా నష్టపోవడం ఖాయమని వాపోతున్నారు. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపడితే క్వింటాకు దాదాపు రూ.1400పైబడే దక్కే అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ వ్యాపారులు, దళారులు మాత్రం క్వింటాకు రూ.1000 నుంచి రూ.1100 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందో తెలీక, పంట నిల్వ చేసుకునే మార్గం లేక పలువురు రైతులు తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కూడా కురుస్తుండడంతో పంట పాడైపోతుందన్న భయంతో తక్కువ రేటుకే బయటివారికి అమ్ముకుంటున్నారు.

రైతులు అతి తక్కువ ధరకే పంట అమ్ముకుంటుండడంతో వారికి పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంటోంది. ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న పంటనైనా సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. మొక్కజొన్నలు అధికంగా పండించే మండలాలైన బోనకల్లు, చింతకాని, సత్తుపల్లి, తల్లాడ, కల్లూరు మండలాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేవలం వ్యవసాయ మార్కెట్‌లలోనే కాకుండా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో, సహకార సంఘాల ద్వారా వీటిని కొనుగోలు చేయాలని విపక్షనేతలు సూచిస్తున్నారు. ఇదిలాఉంటే మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పంటలు కోత కొచ్చే సమయంలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత లేకపోవడంతో ఏటా తాము ప్రైవేట్ వ్యాపారులు, దళారులకు కొంత పంట అమ్ముకోవాల్సి వస్తోందని ఫలితంగా ఆర్ధికంగా నష్టపోతున్నామని అంటున్నారు. మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు కూడా మార్క్ ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత రైతుల పేరుతో అప్పటికే పెద్ద మొత్తంలో సేకరించిన పంటను విక్రయించుకుని లాభపడుతున్నారు. ఈ తరహా అక్రమాలకు అధికారులు పూర్తిగా చెక్ పెట్టి ప్రభుత్వ సాయం అసలైన రైతులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts