అమెరికా ఎన్నికల్లో ఎన్ఆర్ఐలదే కీలకం
వాషింగ్టన్, నవంబర్ 2,
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు విస్తరించని దేశం లేదనడం అతిశయోక్తి కాదు. ప్రతి దేశంలోని ప్రవాస భారతీయులు తమదైన రంగాల్లో ప్రతిభా పాటవాలు చూపుతూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. తద్వారా పరోక్షంగా ఆ దేశ ప్రగతికి దోహదపడుతున్నారు. కొన్ని దేశాల్లో అక్కడి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. బ్రిటన్ లోని ప్రీతీ పటేల్, రిషి సునాక్ కీలకమైన హోం, ఆర్థిక మంత్రులుగా చక్రం తిప్పుతున్నారు. ప్రీతీ పటేల్ గుజరాత్ కు చెందినవారు. రిషీ సునాక్ భారతీయ ఐటీ దిగ్గజం నారాయణ మూర్తి అల్లుడు. అమెరికా, బ్రిటన్ లోనే కాక పలు దేశాల్లో ప్రవాస భారతీయులు రాజకీయంగా కీలక స్థానాల్లో ఉన్నారు.అగ్రరాజ్య్రమైన అమెరికాలో పెద్దసంఖ్యలో ప్రవాస భారతీయులు స్థిరపడ్డారు. వారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా నవంబరు 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ప్రవాస భారతీయులు ప్రముఖపాత్ర పోషిస్తున్నారు. తమిళనాడు మూలాలు గల కమలా హారిస్ ఏకంగా రెండో అత్యున్నత పీఠమైన ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. కమలతో పాటు మరో నలుగురు ప్రవాస భారతీయులు కూడా ఎన్నికల సమరంలో తమ అవకాశాలను పరీక్షించుకుంటున్నారు. అమిబెరా, రోహిత్ ఖన్నా, రాజా క్రిష్ణమూర్తి, ప్రమీల జయపాల్ ఎన్నికల బరిలో విజయం కోసం పోరాడుతున్నారు. వీరంతా రేపటి ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరు ప్రస్తుత విపక్ష డెమొక్రటిక్ పార్టీ నేతలే కావడం గమనార్హం.అమి బెరా అత్యంత సీనియర్ నాయకుడు. ప్రతినిధుల సభకు అయిదోసారి ఎన్నికయ్యేందుకు ఆయన బరిలోకి దిగారు. చట్టసభలో చాలాకాలం పనిచేసిన భారతీయ అమెరికన్ గా అమి బెరా గుర్తింపు పొందారు. సైనికాధికారిగా పనిచేసి రిటైరైన రిపబ్లికన్ పార్టీకి చెందిన బజ్ పాటర్సన్ ఆయనపై పోటీపడుతున్నారు. అయినప్పటికీ అమి బెరా విజయాన్ని అడ్డుకునే పరిస్థితి రిపబ్లికన్ పార్టీకి లేదు. రోహిత్ ఖన్నా, ప్రమీలా జయపాల్ ఎన్నికల బరిలోకి దిగడం మూడోసారి. వీరు తమ ప్రత్యర్థులపై ఆధిపత్యం కలిగి ఉన్నారు. రోహిత్ ఖన్నాపై రిపబ్లికన్ పార్టీకి చెందిన రితేష్ టాండన్ పోటీ చేస్తున్నారు. జయపాల్ ను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్రెయిన్ కెల్లర్ ఢీ కొంటున్నారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన అమెరికన్ గా జయ్ పాల్ గుర్తింపు పొందారు. ఇక క్రిష్ణమూర్తి ఎన్నిక దాదాపు ఖాయమైంది. డెమొక్రటిక్ పార్టకి కంచుకోట వంటి ఇల్లినాయిలోని ఏడో కాంగ్రెషనల్ జిల్లా నుంచి ఆయన బరిలోకి దిగారు. అధికార రిపబ్లికన్ పార్టీకి ఇక్కడ బలం చాలా పరిమితం. అందుకే ప్రైమరీ ఎన్నికల సమయంలోనే బరిలోకి దిగకుండా ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పుకుంది. లిబర్టేరియన్ పార్టీ నేత ప్రీస్టన్ నెల్సన్ రాజా క్రిష్ణమూర్తిని నిలువరించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే రాజాను ఎదుర్కొని నిలబడే పరిస్థితి ఇక్కడ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.కమలా హారిస్ ఏకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. ఆమె గెలిస్తే అమెరికా చరిత్రలో అదో అద్బుతం అవుతుంది. తద్వారా 2024లో అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం ఉంటుంది. తొలి నుంచీ అత్యధిక భారతీయులు డెమొక్రటిక్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తులో తమ పార్టీకి చెందిన ప్రవాస భారతీయురాలు నిక్కీ హేలీని ఉపాధ్యక్ష పదవికి ప్రతిపాదించే అవకాశం ఉందని పేర్కొంది. హేలీ పంజాబ్ కు చెందిన వారు. ఆమె గతంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా శాశ్వత రాయబారిగా పనిచేశారు. ప్రవాస భారతీయులు అగ్రరాజ్య రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం దేశానికి గర్వ కారణం.