కేసీఆర్ టార్గెట్..వయా జగన్
హైద్రాబాద్, నవంబర్ 2,
అందమైన అమ్మాయి ఉంటే ముసలోడి కన్ను అయినా అలా కొంటెగా కొట్టుకుంటుంది. ఇది సృష్టి సహజం. అలాగే బలవంతుడిని చూస్తే తమవైపు తిప్పుకోవాలన్న ఆరాటం కూడా ఎవరికైనా ఉండడం సహజమే. రాజకీయాలో అవసరాల బట్టి స్నేహాలు ఉంటాయి. శత్రువు శత్రువు మనకు మిత్రుడు అవుతాడు అన్నది కూడా ఒక కచ్చితమైన రూల్. ఇక టీఆర్ఎస్ తోనూ కేసీయార్ తోనూ జగన్ కి బాహాటంగా చెడింది. దానికి కారణం తెలంగాణా బీజేపీ అన్న సంగతి కూడా తెలిసిందే. జగన్ కేసీయార్ మంచి మిత్రులుగా ఉన్నపుడు అందరికీ కళ్ళు కుట్టాయి. ఇపుడు విడిపోయాక ప్రత్యర్ధులు జగన్ కి కన్ను కొడుతున్నారు. అదేనేమో పాలిట్రిక్స్ అంటే.పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని జగన్ పెంచుకోవడానికి లోపాయికారిగా కేసీఆర్ అంగీకరించారు అని వైసీపీ నేతల ఇన్సైడ్ వాదన. అయితే చూసీ చూడనట్లుగా ఈ కధ సాఫీగా సాగిపోతుందనుకుంటే తెలంగాణాకు కొత్తగా బీజేపీ ప్రెసిడెంట్ అయిన బండి సంజయ్ దాన్ని పట్టుకుని మొత్తం తేనే తుట్టెను కదిపారు. తెలంగాణాకు క్రిష్ణా నది నీళ్ళు లేకుండా కేసీఆర్ చేస్తున్నాడు అంటూ గొంతు చించుకున్నారు. నిజానికి తమకు వాటాగా వచ్చే నీటినే నష్టపోకుండా హెచ్చు మోతాదులో తీసుకెళ్ళేందుకు పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు అని జగన్ చెబుతున్నా వినిపించుకోకుండా కాంగ్రెస్ సైతం రంకెలు వేసింది. ఇలా విపక్షాలు అన్నీ ఒక్కటి అయ్యేసరికి చిర్రెత్తుకొచ్చిన కేసీఆర్ జగన్ మీద పడ్డారు. అలా అది చిలికి చిలికి పెద్ద వివాదమే అయి కూర్చుంది.ఇక మరో వైపు ఏపీలో ఉన్న ఆర్ధిక, రాజకీయ అవసరాల దృష్ట్యా జగన్ కేంద్రంలోని మోడీతో దోస్తీ చేయక తప్పని అనివార్యత ఉంది. మోడీకి జగన్ నో చెబితే జై కొట్టడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు. దాని వల్ల ఏపీకి పైసా రాకపోగా మరిన్ని కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక కేంద్రంతో సన్నిహితంగా ఉంటే వచ్చే పైసా అయినా తిన్నగా వస్తుందని భావించి జగన్ మోడీ వైపు ఉంటున్నారు. ఈ లాజిక్ తెలిసి కూడా కేసీఆర్ జగన్ అంటే మండిపోతున్నారు. తన మేనల్లుడి హరీష్ రావు ద్వారా జగన్ ని తిట్టిస్తున్నారు. కేంద్రం చెప్పినట్లుగా జగన్ ఏపీలో చేస్తూ మోటార్లకు మీటర్లను బిగించి మరీ రైతుల నోట్ల మట్టి కొడుతున్నారని హరీష్ రావు ఎప్పటికపుడు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ ప్రోద్బలంతోనే అని తెలిసిందే.ఇక ఇద్దరు మిత్రుల మధ్య విజయవంతంగా చిచ్చు పెట్టిన బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరుతున్నారు. తాము బలంగా ఉన్నామని, వైసీపీ కూడా సహకరిస్తే కేసీఆర్ ని ఇంటికి పంపించడం మరింత సులువు అవుతుందని కూడా అంటున్నారు. మరి జగన్ ఈ విషయంలో కలసి వస్తారా అన్నది చూడాలి. ఎంత కాదనుకున్నా తెలంగాణాలో రెడ్లు రాజకీయంగా బలంగా ఉంటారు. దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ లో ఆంధ్రా నుంచి వలస వచ్చిన వారు అధికంగా ఉంటారు. వైసీపీ మద్దతుని గత ఎన్నికల్లో తీసుకుని అక్కడ టీయారెస్ బాగానే సీట్లు గెలుచుకుంది. ఇక 2018 శాసనసభ ఎన్నికల్లో కూడా లోపాయికారీ సాయాన్ని జగన్ టీయారెస్ కి అందించారని చెబుతారు. మరి ఇపుడు జగన్ కనుక ఫ్లేట్ ఫిరాయిస్తే బీజేపీకి రాజకీయంగా లాభం అవుతుంది. మరి తెలంగాణా రాజకీయాల వైపు జగన్ చూస్తారా. కేసీయార్ కి ఎదురు వెళ్తారా అన్నది చూడాలి.