YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అవస్థల స్టాండ్లు!

అవస్థల స్టాండ్లు!

మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని పలు బస్ స్టాప్ ల్లో వసతుల లేమితో ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు.  నిత్యం వేలాది బస్సులు రాకపోకలు సాగించే ప్రాంగణాల్లోనూ అరకొర సౌకర్యాలే ఉండడంతో జనాలకు తిప్పలు తప్పడంలేదు. ప్రస్తుతం వేసవి కావడంతో ప్రయాణికులు దాహార్తితో అల్లాడిపోవాల్సి పరిస్థితులు ఉంటున్నాయి. బస్టాండ్లలోని శుద్ధనీరు అందించాల్సిన ప్లాంట్లు అటకెక్కడంతో ప్రజలు వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు కొనుగోలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఏ బస్టాప్ లో చూసినా ఆయా ప్రాంగణాల్లో ఏర్పాటైన స్టాళ్లలో వాటర్ బాటిల్స్ కోసం జనాలు పోటీపడుతున్నారు. తాగడానికే కాక మరుగుదొడ్లకు వెళ్లాలన్నా నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి తప్పటం లేదని పలువురు ప్రయాణికులు చెప్తున్నారు. ఎక్కడా ఉచితంగా శుద్ధనీరు లభించడంలేదని అధిక ధరకు నీళ్ల బాటిళ్లు కొని దాహం తీర్చుకొంటున్నామని అంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తొమ్మిది ఆర్టీసీ డిపోల పరిధిలో ఉన్న 15 ప్రధాన బస్టాండ్లలోనూ ఇవే  దుర్భర పరిస్థితులు ఉన్నాయని సమాచారం. 

 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మహబూబ్‌నగర్‌, జడ్చర్ల బస్టాండ్లలో మినహా మరెక్కడా వాటర్‌ప్లాంట్లు పనిచేయడం లేదు. మహబూబ్‌నగర్‌, జడ్చర్లలో ఉన్న వాటర్‌ప్లాంట్లు కూడా ప్రయాణికులకు సమర్ధవంతమైన శుద్ధజలం అందని పరిస్థితులు ఉంటున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఫిల్టర్‌బెడ్లు పనిచేయకపోవడంతో ఈ ప్లాంట్ల నుంచి శుద్ధజలం కాకుండా మామూలు నీళ్లు సరఫరా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలా సరఫరా అవుతున్న నీరు చల్లగా లేకపోవడంతో ఆర్టీసీ వాటర్‌ప్లాంట్ల వైపు ప్రయాణికులు దృష్టి సారించని దుస్థితి. దీంతో చల్లటి నీరు కోసం ప్రయాణికులు దుకాణాలనే ఆశ్రయిస్తున్నారు. కొన్ని బస్టాండ్లలో అయితే అసలు వాటర్‌ప్లాంట్లే లేవు. దీంతో ఇక్కడి బస్టాపుల్లో నీటి కోసం ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు లీటరు మంచినీటికి రూ.22 నుంచి రూ.25 వరకు పెట్టి కొంటున్నారు. కల్వకుర్తి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ బస్టాండ్లలో వాటర్‌ప్లాంట్లు ఉన్నప్పటికీ పనిచేయడం లేదు. ఏడాది నుంచి మూలనపడ్డాయి. ఈ సమస్యలపై సంబంధిత అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాగునీరు పుష్కలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts