ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం గెలిచిన తెలుగుతేజం రాగాల వెంకట్ రాహుల్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సత్కరించారు. బుధవారం అమరావతిలోని మంత్రి కార్యాలయానికి వెళ్లిన రాహుల్.. ఆయన్ని కలిశారు. కామన్వెల్త్‌లో గెలిచిన బంగారు పతకాన్ని ఆయనకి చూపించారు. ఈ విషయాన్ని మంత్రి లోకేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఫొటోలు కూడా పెట్టారు. ‘గర్వకారణమైన క్షణాలు. కామన్వెల్త్ గేమ్స్ 2018లో వెయిట్‌లిఫ్టింగ్ 85 కేజీల పురుషుల విభాగంలో బంగారు పతకం గెలుచుకున్న వెంకట్ రాహుల్ రాగాలను సత్కరించాం. భవిష్యత్తులో మరిన్ని వేదికలపై విజయాలు అందుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను’ అంటూ లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.రాగాల వెంకట్ రాహుల్‌కు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. వెంకట్‌కు రూ.30 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఏప్రిల్ 12 వెల్లడించారు. పేదరికంలో పుట్టినా, ప్రతిభ ఉంటే విజయాలు సొంతమవుతాయని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. కామన్వెల్త్‌లో తొలి స్వర్ణం సాధించిన వెయిట్‌లిఫ్టర్‌గా రికార్డులకెక్కిన వెంకట్ రాహుల్‌పై క్రీడా, రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాహుల్‌ను అభినందిస్తూ గతంలోనే ట్వీట్ చేశారు. జనసేన పార్టీ తరఫున రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. కాగా, వెంకట్ రాహుల్ స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం.