చీరాల చికాకులు పోయేలాలేవు
ఒంగోలు, నవంబర్ 3,
ఁనిజమే.. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. రాజకీయాల్లో ఇద్దరు హేమాహేమీనేతలు ఒకే పార్టీలో ఉండటం కష్టం. చీరాల నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య అధికారులు నలగిపోతున్నారు. ఏ పని చేయాలన్నా ఎవరికి కోపం వస్తుందోనన్న టెన్షన్ తో ఉన్నారు. అధిష్టానం సయితం ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించి విఫలమవ్వడంతో చీరాలలో నిత్యం అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.చీరాల నియోజకవర్గం వైసీపీ అధినాయకత్వానికి కూడా తలనొప్పిగా మారింది. ఆమంచి కృష్ణమోహన్ బలమైన నేత. ఆయనను పర్చూరు ఇన్ ఛార్జిగా పంపాలనుకున్నా ఆయన అందుకు అంగీకిరంచలేదు. చీరాల వైసీపీ ఇన్ ఛార్జిగానే కొనసాగుతున్నారు. మరోవైపు కరణం బలరాం పార్టీలో చేరడంతో ఇద్దరి గ్రూపుల మధ్య అధికారులు నలిగిపోతున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాల్సి వస్తోంది.ఇక అధికారులు సయితం ఎవరి మాట వినాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కొందరు అధికారులు తమను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తుండటంతో ఆమంచి, కరణం వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎంత సర్దిచెప్పినా ఇద్దరూ వినకపోవడంతో ఏం చేయలో తెలియక ఈ సమస్యను జగన్ వద్దకే నెట్టారంటున్నారు.అధికారుల బదిలీ విషయాల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు. పోలీసు అధికారుల ఖాళీలు భర్తీ చేయలేక ఇన్ ఛార్జి బాధ్యతలను పక్కవారికి అప్పగించారంటే పరిస్థితి ఏరకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. డీఎస్పీ ఇటీవల రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలంటే జిల్లా ఎస్పీకి కరణం, ఆమంచి నుంచి కొన్ని పేర్లు సిఫార్సులు రావడంతో ఇద్దరిని పక్కనపెట్టి అక్కడ ఇన్ ఛార్జిని నియమించారు. చీరాలలో అధికారులను నియమించాలంటే ఉన్నతాధికారులు జడిసిపోతున్నారు. ఇప్పటికైనా అధినాయకత్వం జోక్యం చేసుకోకుంటే చీరాలలో పరిస్థితి మరింత ముదిరిపోయే అవకాశముంది.