జేసీ ఫ్యామిలీకి మళ్లీ అందలం
అనంతపురం, నవంబర్ 3,
టీడీపీ భావి అధ్యక్షుడు, ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్.. కొద్ది రోజుల కిందట అనంతపురం జిల్లాలో పర్యటించారు. టీడీపీకి కంచుకోట వంటి ఈ జిల్లాలో లోకేష్ పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు లోకేష్ ప్రయత్నించారు. నేరుగా రైతులతో మాట్లాడారు. ఆయన వచ్చే ముందు రాష్ట్ర టీడీపీ సీనియర్లకు ఫోన్లు చేశారు. ఒక్క పయ్యావుల కేశవ్ తప్ప మిగిలిన వారంతా దాదాపు వచ్చారు. పనిముగించుకుని లోకేష్ వెళ్లిపోయారు. ఇప్పటి వరకు బాగానే జరిగిన కార్యక్రమంపై తర్వాత పోస్ట్ మార్టం జరిగింది.ఈ పోస్ట్‌మార్టమ్‌లోనే బోలెడన్ని గుసగుసలు వినిపించాయి. లోకేష్ తన పర్యటనలో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారనేది కొందరు నేతల వాదన. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వారి అనుచరులే చెప్పడం ప్రాధాన్యంగా మారింది. దీంతో లోకేష్ పర్యటన తీరుపై చర్చ జరుగుతోంది. లోకేష్ అనంత పర్యటనలో భాగంగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు.. పవన్ రెడ్డి హైదరాబాద్ నుంచి లోకేష్ వెంట కారులో వచ్చారు. జేసీ పవన్, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కనుసన్నల్లోనే లోకేష్ పర్యటన అంతా సాగిందని.. దీంతో జిల్లాకు చెందిన సీనియర్లకు ప్రాధాన్యం లేకుండా పోయిందనేది ప్రధాన టాక్.వాస్తవానికి జిల్లాలో కీలక నేతలు చాలా మంది ఉన్నారు. వీరిలో సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, ఉన్నం హనుమంత రాయచౌదరి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఉన్నారు. వీరితోపాటు అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ కాల్వ శ్రీనివాసులు కూడా ఉన్నారు. ఇక, లోకేష్ వస్తున్నాడని తెలిసి.. నిన్న మొన్నటి వరకు పార్టీలో అంటీముట్టనట్టుగా ఉన్న మాజీ మంత్రి పరిటాల సునీత కూడా వచ్చారు. అయితే, కారు దిగిన దగ్గర నుంచి కారు ఎక్కే వరకు కూడా లోకేష్ జేసీ పవన్‌కే ప్రాధాన్యం ఇవ్వడం, భోజనాల గదిలోనూ ఆయనను పక్కనే కూర్చోబెట్టుకోవడం వంటివి వీరిని ఒకింత అసంతృప్తికి గురి చేశాయనేది అనంత టీడీపీ టాక్.దీంతో 2014 దాకా టీడీపీని అణచివేసిన జేసీ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని.. వారి ఆవేదన. అయితే, ఇదంతా కూడా టీ కప్పులో తుఫానేనని.. ఇవన్నీ లోకేష్ వంటి కీలక నాయకులు వచ్చినప్పుడు సహజంగా చోటు చేసుకునేవేనని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. జిల్లాలో లోకేష్ పర్యటన కొంచె తీపి.. కొంచెం వగరుగా ఉండడం మాత్రం చర్చకు దారితీయడం గమనార్హం. అయితే ఇటీవల పలు కేసుల్లో అరెస్ట్ కావడంతో లోకేష్ జేసీ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.