తిరుపతి రూరల్ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శివ పై ఓ మహిళ మానవ హక్కుల కమిషనర్ కి పిర్యాదు చేసింది. తిరుపతి రూరల్ మండలం వేదంతపురం గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త కొద్ది రోజుల క్రితం మరణించాడు. ఆయన పేరు మీద ఉన్న 20 సెంట్ల భూమిని తన పేరున మార్చుకోవడానికి బాధితురాలు తన కూతురితో కలిసి తిరుపతి రూరల్ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శివ ని కలిసి , విషయాన్ని వివరించారు. అయితే భూమిని తన పేరు పై మార్చాలంటే రెండు లక్షలు డిమాండ్ చేసాడు. నగదు ఇవ్వలేని పరిస్థితుల్లో తన కూతురిని గెస్ట్ హౌస్ కి పంపించాలని వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. అక్కడ న్యాయం జరగక పోయే సరికి మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేసింది. మానవ హక్కుల అధికారులు ఈ వ్యవహారం పై ఈ నెల 30 లోపల సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని అదేశించారు. అయితే ఈ విషయంపై తిరుపతి రూరల్ ఎమ్మార్వో మాట్లాడుతూ శివ వ్యవహారం పై తనకేమీ పిర్యాదు అందలేదని అన్నారు. అతను తప్పు చేసుంటే చట్ట పరమైన చర్యలకు అదేశిస్తానని అన్నారు.