టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ నెల ఐదవ తేదీ నుండి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయనున్నాయని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యతో పాటు గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన ప్రసారాలు అందించగా ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులకూ ప్రత్యేక ప్రసార కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఈ ప్రసారాల్లో ఇంజనీరింగ్ బ్రాంచ్ లపై అవగాహన, ఓవర్ వ్యూ, నైపుణ్యంపై శిక్షణ వంటి అంశాలపై ప్రసార కార్యక్రమాలుంటాయన్నారు. ఈ నెల ఐదవ తేదీ గురువారం ప్రారంభమై ప్రతి రోజు ఉదయం 9:30 నుండి 10:00 గంటల వరకు నిపుణ ఛానల్, విద్య ఛానల్ లో రాత్రి 9:30 నుండి 10:00 గంటల వరకు 25వ తేదీ బుధవారం వరకు అరగంట పాటు 20 రోజులు ప్రసారాలుంటాయని వెళ్లడించారు. ఇరవై రోజుల పాటు జరిగే ప్రసారాల్లో ఇంప్రూవింగ్ లెర్నింగ్ స్కిల్స్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ వంటి తదితర ప్రధాన అంశాలపై అవగాహన కార్యక్రమాలుంటాయని శైలేష్ రెడ్డి వివరించారు. అనుభవం కలిగిన అధ్యాపకులు అందించే ఇంజినీరింగ్ పాఠ్యాంశాలను విద్యార్థులు వినియోగించుకునేలా వారి తల్లిదండ్రులూ ప్రోత్సహించాలని సీఈవో సూచించారు.