ప్రైవేట్ కు 40 వేల కిలోమీటర్లు....
హైద్రాబాద్, నవంబర్ 4,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఒప్పందం ఖరారైంది. తెలంగాణలో తిరుగుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులను రూట్లవారీగా తగ్గించుకొనేందుకు అంగీకారం కుదిరింది. అదే సమయంలో తెలంగాణలో దాదాపు 40వేల కి.మీ.,పైగా ప్రయివేటు బస్సుల రంగ ప్రవేశానికీ మార్గం సుగమమైనట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై ప్రస్తుతానికి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇచ్చే పరిస్థితి లేదని టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఒప్పందం వివరాలను సోమవారం రవాణామంత్రి సమక్షంలో జరిగే సమావేశంలోనే వెల్లడిస్తారని ఆశాఖ అధికారులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలకు నడిపే సర్వీసులను ఏపీఎస్‌ఆర్టీసీ భారీగా తగ్గించుకుంది. గతంలో 1009 బస్సులను 2,65,367 కిలోమీటర్ల మేర తెలంగాణ భూభాగంలో నడిపేది. తాజా ఒప్పందం ప్రకారం 638 సర్వీసులు, లక్షా 60 వేల 999 కిలోమీటర్లకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ఇప్పటి వరకు 746 సర్వీసుల్ని లక్షా 52 వేల 344 కిలోమీటర్లు మేర ఆంధ్రప్రదేశ్ పరిధిలో నడుపుతున్నది. ప్రస్తుత ఒప్పందంతో 76 సర్వీసులు, 8 వేల కిలోమీటర్లు టీఎస్‌ఆర్టీసీకి పెరుగుతాయి. ఏపీతో సమానంగానే టీఎస్‌ఆర్టీసీ కూడా అక్కడి భూభాగంలో బస్సుల్ని తిప్పుతుంది. అదే సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య 295 సర్వీసులు తగ్గుతున్నట్టు తెలిసింది. విజయవాడ-హైదరాబాద్ రూట్‌లోనే దాదాపు 32,530 కి.మీ., మేర బస్సులు తగ్గుతున్నాయి. రాయలసీమ రూట్‌లోనూ ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గుతున్నది.మొత్తంగా దాదాపు 40వేలకు పైగా కిలోమీటర్ల పరిధిలో ఆర్టీసీ బస్సులు తగ్గుతున్నాయి. ఆ రూట్లను ప్రయివేటుకు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. అయితే దీనిపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశాలు లేవని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. లాక్‌డౌన్ ముందు వరకు విజయవాడ- హైదరాబాద్ మార్గంలో రోజూ 374 సర్వీసులు లక్షా 3వేల 702 కిలోమీటర్ల మేర ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్ని నడిపేది. ఇకపై ఈ రూట్‌లో 192 బస్సులను 52,524 కిలోమీటర్లు మాత్రమే నడిపేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఈ ఒక్క రూట్‌లోనే ఆంధ్రప్రదేశ్ నుంచి 182 సర్వీసులు, 51,178 కిలోమీటర్ల మేరకు తగ్గనున్నాయి. గతంలో ఈ మార్గంలో టీఎస్ ఆర్టీసీ 162 బస్సులను 33,736 కిలోమీటర్ల మేర తిప్పేది. ఇప్పుడు 273 సర్వీసులకు పెంచారు. ఇకపై ఏపీతో సమానంగా 52,384 కిలోమీటర్ల మేర బస్సులు నడుస్తాయి. ఈ రూటులో రెండు రాష్ట్రాలు కలిసి 32,530 కిలోమీటర్ల మేర సర్వీసుల్ని నిలిపివేస్తున్నాయి. రాయలసీమ రూటులోనూ ఇదే పరిస్థితి ఉంది.కొత్త ఒప్పందం ప్రకారం టీఎస్‌ఆర్టీసీకి స్వల్పంగా ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో 40 వేలకు పైగా కిలోమీటర్ల పరిధిలో ప్రయివేటు బస్సులు తిరిగేందుకు అవకాశం లభించినట్టు అయ్యిందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆర్టీసీకి తాత్కాలికంగా పెరుగుతున్న ఆదాయాన్నే ప్రభుత్వం ప్రచారం చేస్తుందనీ, ప్రయివేటు బస్సులు చాపకింద నీరులా విస్తరిస్తాయనే ఆందోళన ఆర్టీసీ కార్మికుల్లో కనిపిస్తున్నది.