YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పద్మవ్యూహంలో జగన్

పద్మవ్యూహంలో జగన్

పద్మవ్యూహంలో జగన్
న్యూఢిల్లీ, నవంబర్ 4, 
జగన్ ని అభిమన్యుడు అని రాజకీయాల్లో పిలుస్తారు. దానికి కారణం ఆయన ఎపుడూ విడదీయలేని చక్రబంధంలో చిక్కుకుని యుద్ధం చేస్తూండడమే. అభిమన్యుడుకి జగన్ కి ఒక కామన్ పోలిక ఉంది. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేదించడం ఎలాగో తెలియకుండా వెళ్లి ఇరుక్కుంటాడు. రాజకీయ భారతాన జగన్ ప్రయాణం కూడా అలాగే మొదలైంది. ఆయన తండ్రి తోడూ నీడ లేకుండా ఒంటరివాడుగా నిలిచి మహాసముద్రం లాంటి కాంగ్రెస్ ని ఏమీ తెలియకనే ఎదిరించారు. కొండను ఢీ కొట్టారు. దాని పర్యవసాన్ని ఆయన అనుభవించారు కూడా. ఇక పదేళ్ల తరువాత అధికారం చేతిలో పడింది, జగన్ కష్టాలు తీరాయా అంటే లేదు సరికదా ఇంకా కొత్తవి కూడా వచ్చి చేరుతున్నాయి.ఏపీ సీఎం పీఠం బంపర్ మెజారిటీతో పట్టేశాను అన్న సంబరం జగన్ కి తొలి రోజుల్లోనే పోయింది. కేవలం 130 కోట్ల రూపాయలను మాత్రమే అక్కడ ఉంచి బాబు కుర్చీ దిగిపోయారని ప్రచారంలో ఉంది. అది లగాయితూ ఖాళీ అయిన అర్ధిక వ్యవస్థతో జగన్ కుస్తీ పడుతూనే ఉన్నారు. ఇక అమరావతి రాజధానిని కోరి కెలుక్కున్నారా లేక‌ జగన్ అజెండా అదేనా అన్నది తెలియదు కానీ అది కోతి పుండు బ్రహ్మ రాక్షసిగా మారిపోయింది. కోర్టులో మూడు రాజధానులు పడి జగన్ ఆశలను ఒక్కసారిగా చల్లార్చేసింది. ఇదిలా ఉంటే కరోనా వచ్చి నష్టాలను మరింత పెంచేసింది. ఇపుడు పోలవరం ప్రాజెక్ట్ కూడా జగన్ కి శాపంగా మారుతోంది అంటున్నారు.ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులు తెలంగాణా భూభాగంలో అడుగుపెట్టరాదని కేసీఆర్ కొత్త ఆంక్షలు విధించారు. ఇది నిజంగా విడ్డూరమే. అంతర్రాష్ట్ర రవాణా విషయంలో కేసీఆర్ కేవలం ఏపీకి మాత్రమే కొత్త రూల్స్ పెడుతున్నారు. కర్నాటక, మహరాష్ట్రలకు మాత్రం ఏ విధమైన షరతులు లేవు. మరి జగన్ మెతకదనం చూసి చేస్తున్నారా. లేక జల వివాదాలు గుర్తువచ్చి పట్టు బిగిస్తున్నారా. మోడీతో జగన్ చెలిమిని చూసి సహించలేక చేస్తున్నారా అన్నది తెలియదు కానీ జగన్ అంటేనే కేసీయార్ నిప్పులు కక్కుతున్నారు. ఫలితంగా ఈ దసరా ఏపీ జనాలకు నరకం చూపించింది. ఏపీ పొలిమేరల వరకూ సొంత రాష్ట్రం బస్సులు నడిపితే అది దాటి తెలంగాణా భూభాగంలోకి వెళ్ళి మళ్ళీ బస్సులు పట్టుకుని గమ్యం చేరుకోవాల్సివచ్చింది. కేసీయార్ ఇలా పొరుగు నుంచి జగన్ ని బాగానే గిల్లేస్తున్నారు. ఇక ఇది అరంభం మాత్రమేనట. ముందు ఇంకా పెద్ద సినిమా జగన్ కి చూపిస్తారట.అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరగా కేంద్రంలోకి మోడీతో జగన్ దోస్తీ చేస్తున్నారు. రాజ్యసభలో బిల్లులకు కళ్ళు మూసుకుని మద్దతు ఇస్తున్నారు. ఇపుడు పోలవరానికే భారీ టెండర్ పెట్టేశారు మోడీ. జగన్ ని రాజకీయంగా అతి పెద్ద దెబ్బ కొట్టేశారు. మోడీ అంటే మొండి అంటారు. పైగా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఎందరినో వంచేసిన మోడీకి జగన్ ఒక లెక్క కాదు, ఇక జగన్ కి వ్యక్తిగతంగానూ, ఏపీ పరంగానూ అనేక సమస్యలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్లుగా కోర్టులతో కూడా జగన్ తాజాగా గొడవ పెట్టుకున్నారు. ఈ సమయంలో ఆయన మోడీని ఢీ కొట్టి పోలవరం విషయంలో పోరాడగలరా అన్నది పెద్ద ప్రశ్న. పోరాడలేకపోతే ఏపీకి పోలవరం దక్కకుండా పోతుంది. అలా రాజకీయంగా జగన్ ఫెయిల్ అవుతారు. ఒకవేళ మోడీని ఢీ కొడితే ఏం జరుగుతుందో ఎవరూ కనీసం ఊహించలేరు. ఇక అప్పుల కుప్పగా ఉన్న ఏపీ కూడా జగన్ కి మరో వైపు పెను సవాల్ విసురుతుంది. మొత్తానికి చూస్తే పద్మవ్యూహంలో అభిమన్యుడి కన్నా కూడా పెద్ద చిక్కులూ చికాకులతో జగన్ ఇరుక్కుపోయారు. బయటపడే మార్గం ఉందా?

Related Posts