మళ్లీ తగ్గిన బంగారం
ముంబై, నవంబర్ 4,
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట. పసిడి ధర మళ్లీ తగ్గింది. ఈరోజు కూడా బంగారం ధర వెలవెలబోయింది. పసిడి పడిపోయింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పడిసి తగ్గడం గమనార్హం. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది.హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గుదలతో రూ.51,550కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.340 తగ్గింది. దీంతో ధర రూ.47,250కు పడిపోయింది.బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం దూసుకెళ్లింది. కేజీ వెండి ధర రూ.800 పెరిగింది. దీంతో వెండి ధర రూ.67,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 1912 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరుగుదలతో 24.42 డాలర్లకు ఎగసింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.