భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే విశాఖ ఎంపీ హరిబాబు విషయంలో ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి. ఈయనకు కేంద్రమంత్రి పదవి దక్కబోతోందనే మాట వినిపిస్తోందిప్పుడు. ఇటీవలి రాజకీయ పరిణామాల నేఫథ్యంలో హరిబాబుకు కేంద్రంలో సహాయమంత్రి పదవి దక్కడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి కేంద్రమంత్రులుగా ఉండిన వాళ్లు ఇటీవల ఆ హోదాల నుంచి తప్పుకున్న విషయం విదితమే. ఉప రాష్ట్రపతిగా వెళ్లిపోవడంతో వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో ఏపీ నుంచి కేంద్రమంత్రులు ఎవరూ లేకుండాపోయారు. టీడీపీ, బీజేపీలు వేర్వేరయిపోవడంతో అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్రమంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. వెంకయ్యకు ప్రత్యామ్నాయంగా, సుజనా, అశోక్‌ల స్థానంలో ఏపీ బీజేపీ నేతలకు కేంద్రంలో మంత్రి పదవులు దక్కడం ఖాయమని ప్రచారం కొన్నాళ్ల నుంచి జరుగుతోంది. ఇప్పుడు హరిబాబు బీజేపీ ఏపీ విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కూడా వ్యూహాత్మకమే అని, హరిబాబుకు కేంద్రమంత్రి పదవిని ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.ఏపీలో బీజేపీ బలోపేతంపై అధిష్టానం దృష్టిపెట్టిందని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇక్కడి వ్యవహారాల్లో చాలా మార్పులు ఉంటాయని కమలనాథుల మధ్యన చర్చ జరుగుతోంది.