నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని.. ఏపీలో కూడా కేసులు 2వేలకు తగ్గాయన్నారు. గతంలో ఎన్నికలు వాయిదా వేయకపోయుంటే ఇబ్బందులు ఎదురయ్యేవని.. ఇప్పుడు ప్రజలకు కరోనాపై అవాహన పెరిగింది అన్నారు. ప్రజల్లో చైతన్యం, అవగాహన వచ్చింది కాబట్టి ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సి ఉందన్నారు. 10 ఉన్నప్పుడు వాయిదా వేసి 2వేలు ఉన్నప్పుడు ఎందుకు పెడుతున్నారని కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఎన్నికల విషయంలో కరోనా కేసుల ప్రస్తావిస్తున్న ప్రభుత్వం.. స్కూళ్లు ఎలా ప్రారంభించిందన్నారు ఎంపీ. విద్యార్థుల హాజరు 50శాతం ఉన్నా 80శాతం ఉన్నట్లు చెప్పుకున్నారని.. 1 నుంచి 6 తరగతి వరకు కూడా డిసెంబర్ 14 నుంచి స్కూళ్లు తెరుస్తారని చెబుతున్నారని గుర్తు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల బుద్ధి ఉందా లేదా అని వ్యాఖ్యానించారని.. మంత్రి సురేష్‌ను ఉద్దేశించి అన్నారా.. ఎవరి గురించి అయినా అన్నారన్నది ప్రజలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారన్నారన్నారు. లాక్‌డౌన్ తర్వాత మద్యం షాపులు కూడా తెరిచారు.. పెద్ద, పెద్ద క్యూ లైన్లు చూశామని.. సినిమా హాళ్లు కూడా ఓపెన్ అవుతున్నాయని.. కరోనాకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు.బీహార్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి.. అక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని రఘురామ గుర్తు చేశారు. మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు కూడా అలాగే మాట్లాడితే ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి భయం ఉందనే సంకేతాలు వెళతాయన్నారు. మార్చిలో స్థానిక సంస్థల షెడ్యూల్ వచ్చాక చాలా ఏకగ్రీవం అయ్యాయి, దౌర్జన్యాలు జరిగాయని.. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. జనవరిలో సంక్రాంతి తర్వాత ప్రభుత్వం ఎన్నికలు పెడితే బావుంటుందని.. కానీ ఎస్‌ఈసీగా రమేష్ కుమార్ ఉంటే ఏకగ్రీవాలు జరగవని భావిస్తున్నారని.. ఆయన రిటైర్డ్ అయ్యాక ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారని ప్రజలు అందరూ భావిస్తున్నారు.. అది నిజమో కాదు మీ మనసులకు తెలియాలి' అన్నారు ఎంపీ. ఎన్ని మాట్లడినా కోర్టులు సరైన తీర్పు ఇస్తాయని.. కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవద్దని హితవు పలికారు.