ఏపీలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు హాజరవుతున్నారు.. తల్లిదండ్రుల అంగీకార పత్రంతో విద్యార్థులు వస్తున్నారు.. స్కూళ్లలో జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెన్షన్ పెడుతోంది. ఒకటి రెండు జిల్లాల్లో టీచర్లు, విద్యార్థులకు వైరస్ నిర్థారణైనట్లు తెలుస్తోంది.ప్రకాశం జిల్లాలో నాలుగు జిల్లా పరిషత్ హైస్కూళ్లలో కరోనా కలకలం రేగింది. నలుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు కరోనా బారిన పడగా.. త్రిపురాంతకం హైస్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడికి, పీసీపల్లి హైస్కూల్‌లో ఓ విద్యార్థి, ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. హనుమంతునిపాడు మండలం పెద్దగొల్లపల్లి హైస్కూల్‌లో ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ తేలింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఇటు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు హైస్కూల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలకి కరోనా పాజిటివ్ తేలినట్లు తెలుస్తోంది. ఆమె విద్యార్థులందరికీ భోజనం వడ్డించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ముందస్తు జాగ్రత్తగా టెస్టులు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్కూళ్లు తెరిచిన తొలిరోజే 57 మంది టీచర్లు, ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ తేలింది. దీంతో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి వెనకడుగు వేస్తున్నారు.