జకీయాల్లో సింపతీనే ప్రధానం. పార్టీలకు అతీతంగా నేతలంతా కోరుకునేది.. కావాలని ప్రచారం చేసుకునేది కూడా సింపతీనే. ఎంత ప్రజాదరణ ఉన్న నాయకుడికైనా కూడా సింపతీ రాజకీయమే వెన్నుదన్నుగా ఉంటుంది. దేశవ్యాప్తంగా సింపతీ రాజకీయాలు ఎంతో మంది అనామకులను తిరుగులేని హీరోలను చేసింది. ఈ సింపతీతోనే ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ఈ సింపతీ రాజకీయాలే తెలుగు గడ్డపై నాడు ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంతో పాటు ఆయన్ను దేశవ్యాప్తంగా తిరుగులేని పొలిటికల్ హీరో అయ్యారు. ఇక అదే సింపతీ కేసీఆర్‌ను తెలంగాణలో తిరుగులేని హీరోను చేసింది.ఇక ఏపీ సీఎం జగన్‌ను సైతం ఇదే సింపతీ ఇంత త్వరగా తెలుగు ప్రజలకు కనెక్ట్ చేయడంతో పాటు ఆయన్ను సీఎంను చేసింది. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఆయన సీఎం అయ్యే వరకు ఈ సింపతీ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోయింది. అయితే, ఈ విషయంలో గత ఏడాది వరకు ఉన్న సింపతీని జగన్ కోల్పోతున్నారనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా మేధావి వర్గాల్లో జగన్‌కు సింపతీ ఉంది. ఆయన సీఎం కావాలని కోరుకున్నవారు చాలా మందే ఉన్నారు. వ్యాసాలు, చర్చల ద్వారా.. మేధావులు తమ మనసులో జగన్ సీఎం కావాలని అభిలషించారు.తద్వారా సైలెంట్ ఓటు వెనుక మేధావుల పాత్ర ఉంది. అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్.. మేధావులకు కడు దూరంగా ఉంటున్నారు. పైగా న్యాయవ్యవస్థ వంటి కీలకమైన రాజ్యాంగ వ్యవస్థతో ఢీ అంటే ఢీ అని ఆయన పోరుకు సిద్ధపడడంతో నిన్నమొన్నటి వరకు ఆయనను సమర్ధించిన ఓవర్గం మేధావులు ఇప్పుడు ఈ విషయంలో కలుగ జేసుకునేందుకు, మద్దతుగా వ్యవహరించేందుకు వెనకంజ వేస్తున్నారు. ఇదొక పార్శ్వం అయితే.. మరో కోణంలో చూస్తే.. కీలకమైన మేధావి వర్గం జగన్ పార్టీలోకి చేరాలనుకుంది. వీరిలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటివారు ఉన్నారు.ఆయన జనసేనకు రాజీనామా సమర్పించిన తర్వాత.. వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆయన విరమించుకున్నారని అంటున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రంలో ఉన్నప్పటికీ.. లోక్‌సత్తా సామాజిక ఉద్యమ నేత.. మాజీ ఎమ్మెల్యే , మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ కూడా అడపా దడపా.. జగన్‌ను సమర్ధిస్తూ.. కామెంట్లు చేసేవారు. ఆయన తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థను తొలిసారి అభినందించింది కూడా ఆయనే అయితే.. ఇటీవల పరిణామాలతో ఆయనకూడా మౌనం పాటిస్తున్నారు.ఇక ఉండవల్లి లాంటి మేధావులను జగన్ ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకోవాలని చాలా మంది సూచించారు. ఆయన కూడా ఒకప్పుడు జగన్‌కు దగ్గరవ్వాలనుకున్నా ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయాలను.. ముఖ్యంగా జగన్ న్యాయవ్యవస్థతో ఢీ అంటే ఢీ అనడాన్ని తప్పు పడుతున్నారు. ఇలా చాలా మంది మేధావులు జగన్ వ్యవహార శైలితో విసిగిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి వీరిసింపతీ దూరమైతే.. జగన్‌కు వీరి మద్దతు ఇకపై కష్టమననే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.