ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనను ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ఊసే ఎత్తడం లేదు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నియోజకవర్గాలను పెంచాల్సి ఉంది. వాస్తవానికి మొన్నటి ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉన్నా జరగలేదు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటికి మరో యాభై నియోజకవర్గాలు పెంచాలన్న ప్రతిపాదన ఉంది. అంటే మొత్తం 225 నియోజకవర్గాలు అవుతాయి. అయితే ఈ ప్రతిపాదన ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్దనే పెండింగ్ లో ఉంది. పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా కొత్త అసెంబ్లీ స్థానాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రం విడిపోయి ఆరేళ్లు కావస్తున్నా ఈ ప్రతిపాదనను మాత్రం కేంద్రం పక్కన పెట్టేసింది.2008 లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. నిజానికి 2026 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. కానీ విభజన చట్టంలో ఉండటంతో నియోజకవర్గాల పెంపు చేస్తారని భావించారు. నిజానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల విభజన సమయంలో ఈ అంశం తెరపైకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పెంపు విషయాన్ని లైట్ గా తీసుకుంది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గాల పెంపు కోసం ప్రయత్నం చేశారు. 23 మంది వైసీపీ శాసనసభ్యులను పార్టీలోకి చేర్చుకోవడంతో పెంపు తప్పదని భావించి ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఇదే విషయాన్ని ప్రస్తావించేవారు. ఇప్పుడు జగన్ కూడా తన ఢిల్లీ పర్యటనలో ఇదే అంశాన్ని చేర్చారని తెలిసింది. అయితే నియోజకవర్గాల పెంపు విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం నియోజకవర్గాల పెంపు పట్ల ఆసక్తి కనపర్చడం లేదని తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో పెంపు జరిగి తీరుతుందని వైసీపీ నేతలు అంటున్నారు