YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఓర్వకల్లులో అంతారెడీ

ఓర్వకల్లులో అంతారెడీ

జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆకాశ వీధిలో ప్రయాణం కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఓర్వకల్లు విమానాశ్రయ పనులు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. తుంగభద్ర పుష్కరాల నాటికి విమాన సర్వీసులను ప్రారంభించడంపై సందేహాలు నెలకొన్నాయి...తొలుత దసరా నాటికి విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం అనుకున్నా అది సాధ్యం కాలేదు. ఈనెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాల ప్రారంభం కానున్న నేపథ్యంలో 20న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. విమానాశ్రయ పనులు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. అనుకున్న నాటికి సర్వీసులు నడపగలరా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఉడాన్‌ పథకం కింద కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుకు విమాన సర్వీసులను నడిపేందుకు ట్రూజెట్‌ సంస్థ రూట్లను దక్కించుకున్నట్లు సమాచారం. సర్వీసులు నడిపేందుకు ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతి కూడా లభించింది. విమానాశ్రయంలో రెండున్నర కిలోమీటర్ల రన్‌వేతో పాటు ఆఫ్రాన్‌, ఐసోలేషన్‌, టాక్సీడే, కాంపౌండ్‌ వాల్‌, టర్మినల్‌ భవనం పనులు పూర్తయినప్పటికీ అంతర్గత పనులు ఇంకా పూర్తి కాలేదు. పరిపాలన భవనంలో తలుపులు, సీలింగ్‌ పనులు, సీసీ టివి, స్మోక్‌ అండ్‌ హీట్‌ డిటెక్టర్‌, ఎయిట్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఎటిసి) టవర్‌, విజన్‌ క్లాస్‌ ప్యానల్స్‌, పెయింటింగ్‌ పనులు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల పనులు, ఎల్‌టి ప్యానళ్లు, షట్టర్‌ డోర్‌ ఫిట్టింగ్‌, ర్యాంపు పనులు, పంపు గదిలోని ఫిక్సింగ్‌ డోర్స్‌, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లో పెయింటింగ్‌, ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌లో ఎలక్ట్రికల్‌ పనులు, హెచ్‌విఎసి, వాచ్‌ టవర్స్‌లోని ఏరో కాన్‌ ప్యానల్‌ పనులు, ఫ్లోటింగ్‌, కేబుల్‌ లైన్స్‌, లైటింగ్‌ తదితర పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఇంకా 30 శాతం వరకూ పనులు పూర్తి కావాల్సి ఉంది. 2013లో కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిలో భాగంగా జిల్లాకు విమానాశ్రయాన్ని ప్రకటించింది. ఓర్వకల్లు మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచర్ల గ్రామాల పరిధిలో 639 ఎకరాల్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. 2016లో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆమోదముద్ర వేసింది. 2017లో టిడిపి ప్రభుత్వం భూసేకరణ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.120 కోట్లతో నిర్మాణ పనులకు 2017 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబర్‌లో రన్‌వే నిర్మాణ పనులను చంద్రబాబు ప్రారంభించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణ పనులపై దృష్టిసారించింది. ఇప్పటికే డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ సంస్థ ప్రతినిధులు కూడా ఎయిర్‌ పోర్టును సందర్శించి ఇక నుండి కమర్షియల్‌ విమాన సర్వీసులు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. ఓర్వకల్లు విమానాశ్రయ పనులు పూర్తి కాకపోవడంపై కలెక్టర్‌ వీరపాండ్యన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు సరిగా పని చేయడం లేదని, పనులపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విమానాశ్రయంలో పెండింగ్‌ పనులపైకలెక్టర్‌ సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయ డైరెక్టర్‌ కైలాష్‌ మండల్‌, డిఆర్‌డిఎ పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు. విమానాశ్రయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌లు నిధులను మొత్తం మంజూరు చేశారని తెలిపారు. సకాలంలో పనులను పూర్తి కావాలని ఆదేశించారు.

Related Posts