టీడీపీలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ అధినేత కుమారుడు, టీడీపీ భావి అధ్యక్షుడిగా భావించే నారా లోకేష్.. దూకుడు పెంచారు. నిజానికి పార్టీ ప్రతిపక్షంలోకివచ్చి పదహారు మాసాలైనా లోకేష్ ఇప్పటి వరకు పూర్తి సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. తాజాగా లోకేష్ అమాంతం ఇలా దూకుడు పెంచడానికి కారణం ఏంటి ? గతంలో లేని దూకుడు ఇప్పుడే ఎందుకు వచ్చింది ? అనేవి ప్రధాన ప్రశ్నలు. వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఇప్పుడు నారా లోకేష్ ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను పరామర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మోకాల్లోతు నీటిలో ఆయన పర్యటిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.అయితే, ఊరకరారు మహానుభావులు అన్న విధంగా లోకేష్ అనూహ్యంగా ఈ పర్యటనలకు ప్లాన్ చేసుకో వడం వెనుక ఏదైనా ఉందా ? వ్యూహం లేకుండానే చినబాబు అడుగులు వేస్తున్నారా ? అంటే కానేకాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందులో పరామర్శల కోణం కంటే మరో కోణం కూడా ఉందన్న చర్చలు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు హైదరాబాద్‌లో ఇంటి గడపను కూడా దాటని లోకేష్.. అనూహ్యంగా ఏపీపై ఇంత ప్రేమ పొంగుకు రావడం వెనుక.. తనకు నచ్చని నాయకుడికి తన తండ్రి చంద్రబాబు పదవిని అప్పగించడమేనని అంటున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పగ్గాలను మాజీ మంత్రి టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి అప్పగించారు చంద్రబాబు.అయితే, ఆది నుంచి కూడా అచ్చెన్నపై లోకేష్‌కు సుముఖత లేదు. ఆయన ఎవరి మాటా వినరని, ముఖ్యంగా తాను ఏది సూచించినా.. పెద్దాయనకు చెప్పాలని అనేవారని.. దీంతో తన హవాకుబ్రేకులు వేస్తున్నారనే ఆలోచన ఆది నుంచి చినబాబులో గూడుకట్టుకుంది. దీంతో ఈ పదవికి నెల్లూరుకు చెందిన బీద రవిచంద్రకు ఇప్పించుకునేందుకు లోకేష్ శతవిధాలా ప్రయత్నించారు. అయితే, చంద్రబాబు వ్యూహాత్మకంగా అచ్చెన్నాయుడుకు ఈ పదవిని కట్టబెట్టడంతో ఆయన హవాకు బ్రేకులు వేసేందుకు.. చినబాబు నేరుగా రంగంలోకి దిగారనే ప్రచారం వస్తోంది.నిజంగానే అచ్చెన్నపై విభేదం లేకపోతే.. ఆయనను కూడా ఈ జిల్లాల పర్యటనలో తన వెంట తీసుకువె ళ్లేవారు కదా ? అనే ప్రశ్నకు సమాధానం లేదు. పైగా.. వరదలు వచ్చిన వారానికి చినబాబు స్పందించడం.. కేవలం లోకల్ లీడర్లు మాత్రమే రావాలని ఆంక్షలు విధించడం వెనుక పూర్తిగా తనకనుసన్నల్లోనే పార్టీ నేతలు నడవాలనే సంకేతాలు పంపినట్టు అవుతోందని చెబుతున్నారు. మొత్తానికి అచ్చెన్నాయుడికి బ్రేకులు వేసేలా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తుండడంగమనార్హం. మరి ఇది పార్టీలో ఎటు దారితీస్తుందో ? చూడాలి.