YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

మిరపకు దూరమౌతున్న రైతాంగం

మిరపకు దూరమౌతున్న రైతాంగం

మిరప సాగు నానాటికి రైతులకు దూరమవుతోంది. ప్రధానంగా పెరిగిన పెట్టుబడి వ్యయం, లభించని గిట్టుబాటు ధర, చీడపీడలు, మారిన ప్రకృతివైపరీత్యాల కారణంగా మిరప సాగు చేయాలంటే అన్నదాతలు ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. దశాబ్దం క్రితం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో మిర్చి సాగు చేసే రైతులు లాభాల పంట పండించారు. కాని మారిన కాలమాన పరిస్థితులు మిరప సాగుకు అనుకూలంగా లేవని అందుకే ఇతర సంప్రదాయ, సామాజిక అడవులైన సుబాబుల్, జామాయిల్, పత్తి పంటలవైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా  వ్యవసాయం మొత్తం కౌలు రైతుల చేతిలోకి వెళ్ళిపోయింది. పెద్దకమతాలు ఉన్నప్పటికీ రైతులు మిరపసాగు చేసే ధైర్యం చేయటంలేదు. దీంతో మిరప సాగు ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే సాగుచేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో మిరపసాగులో సాలు తోటలు, రైతులే సొంతంగా నారు పెంచి మిరప సాగుచేసేవారు. కాని ప్రస్తుతం ప్రతి మండలానికి నారు పెంచే నర్సరీలు అనేకంగా పుట్టుకురావటంతో రైతులు నర్సరీల నుండే నారు కొని పంట సాగు చేస్తున్నారు. దీంతో గత కొన్నేళ్ళుగా రైతులు కొత్త సంక్షోభంతో నష్టపోతున్నారు. నారు పెంచుతున్న నర్సరీలు లాభాపేక్షతో నాసిరకం విత్తనాలు ఉపయోగించటంతో అనేక చోట్ల పెరిగిన నారు పూతకాత లేక చీడపీడలకు గురై దిగుబడులు సన్నగిల్లి రైతులను నట్టేటముంచిన సంఘటనలు ఉన్నాయి. మండలాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన మిరప నారు నర్సరీలపై అధికారుల అజయాయిషీ కరువై వారి ఇష్టానుసారంగా అధిక ధరలతోపాటు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించని కారణంగా మిరప రైతులు దెబ్బతింటున్నారు. ఇన్ని అవాంతరాలు ఎదురైనప్పటికి అన్నదాతలు మిరప సాగుపై మమకారం చంపుకోలేక అరకొరగా సాగుచేస్తున్నారు. నిలకడగా ధరలేకపోయినప్పటికి తగ్గిన సాగుతో కొంతమేర లాభాలు వస్తుండటంతో కేవలం సొంతంగా వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులు మాత్రమే నేడు మిర్చిసాగులో ఉన్నారు. మిరప సాగు కొంతమేరకు ఆశాజనకంగా ఉంది. ఖరీఫ్ తొలి నుండి ఒక మోస్తరు వర్షపాతం నమోదు కావటంతో మిరప పైరు ఏపుగా పెరిగుతోందని బోనకల్ మండలం ఆళ్ళపాడు గ్రామానికి చెందిన రైతు అల్లిక లక్ష్మీనారాయణ తెలిపారు.

Related Posts