వచ్చే ఎన్నికలలో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు. హిందూపురం అభివృద్ధి విషయంలో బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. హిందూపురానికి తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేయిస్తున్న ప్రత్యేక పైప్‌లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి దాన్ని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.. ఇదే కాకుండా హంద్రీనీవా ద్వారా నీటిని విడుదల చేయించారు. లేపాక్షి ఉత్సవాల నాటికి నీటిని తీసుకురావాలని అనుకున్నా.. చిన్నచిన్న అవాంతరాల వల్ల పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం హిందూపురానికి నీళ్లు రావడమే కాకుండా.. మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లు ఇవ్వగలుగుతున్నారు. బాలయ్య హిందూపురంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా తన రాజకీయ కార్యకలాపాలు నిరంతరం ఇక్కడి నుంచే సాగుతాయని ప్రత్యర్థులకు సంకేతాలు పంపించారని పార్టీ నేతలు అంటున్నారు. గతంలో నియోజకవర్గంలో తక్కువ పర్యటనలు చేసే బాలయ్య ప్రస్తుతం తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేశారు.లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా.. రాయల కాలం నాటి దేవాలయాల అభివృద్ధికి విశేషంగా నిధులను సేకరించారు. దాదాపు 50 లక్షల రూపాయలు వెచ్చించి జఠాయువును ప్రతిష్టించారు. ఏపీ నుంచే కాకుండా కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో తయారు చేయించారు.వచ్చే ఎన్నికల్లో తాను హిందూపురం నుంచే పోటీ చేస్తానని అందులో ఎటువంటి అనుమానం లేదని బాలయ్య తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నందమూరి తారకరామారావు పార్టీ ప్రారంభించినప్పటి నుంచి హిందూపురం నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారిపోయింది. నందమూరి కుటుంబీకులే కాకుండా టీడీపీ తరపున ఎవ్వరు పోటీ చేసినా టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య తన నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ది పనులు చేయడమే కాకుండా ప్రత్యర్థులకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. హిందూపురానికి పరిశ్రమలు, ఇతర కంపెనీలను పెద్ద ఎత్తున ఆహ్వానించారు. బాలయ్య వల్ల హిందూపురం స్వరూపం మారుతుందని అభిమానులు అంటున్నారు.