YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి ఆమోదం

మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి ఆమోదం

మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో..  రూ.5,835 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన
గురువారం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం  కాసేపటి క్రితమే ముగిసింది. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్‌..  చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి ఆమోదం తెలిపింది. అదే
విధంగా రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్టు, కొత్త ఇసుక పాలసీని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక విజయనగరం జిల్లా గాజులరేగలో.. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు,  పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమి
కేటాయింపునకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై  కూడా ఈ సందర్భంగా చర్చించింది. కాగా భేటీ అనంతరం వ్యవసాయ శాఖా మంత్రి కురసాల
కన్నబాబు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలను  పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక పారిశ్రామిక విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలపింది. అలాగే నూతన ఇసుక
విధానంపై కేబినెట్‌ చర్చించనున్నట్లు సమాచారం. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి డీపీఆర్‌పై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.కేబినెట్ భేటీలో ప్రధానంగా.. ప్రజలకు కోరినంత నాణ్యమైన ఇసుకను
అందించేందుకు సవరించిన ఇసుక పాలసీని చర్చించి ఆమోదించనున్నారు. ఇసుక విధానం మెరుగుపరచడం కోసం సిఫార్సుల నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ
కమిటీ సభ్యులు ఇసుక విధానంపై అధ్యయనం చేసి.. ప్రజల సౌలభ్యం కోసం ఇసుకను రీచ్‌ల నుంచే ఇవ్వాలని మంత్రుల కమిటీ సూచించింది. మంత్రుల కమిటీ చేసిన పలు సూచనలను పరిశీలించిన సీఎం జగన్‌ విధాన రూపకల్పన
కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని భావించారు. సీఎం సూచన మేరకు ఈ అంశాలపై ప్రజల నుంచి సలహాలు కోరుతూ అధికారులు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా
ఇసుక పాలసీని ప్రభుత్వం సవరించింది.ప్రభుత్వమే ఇసుక ధర నిర్ణయిస్తుంది. ప్రజలు నేరుగా రీచ్‌ల వద్ద డబ్బు చెల్లించి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్‌ యార్డులు ఉండవు. రీచ్‌ల నుంచి తమకు నచ్చిన వాహనాల్లో ఇసుక తీసుకెళ్లే
స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా నదుల్లో పెద్దఎత్తున డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక వెలికితీతకు ప్రాధాన్యం ఇస్తారు. రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించాలన్నది పాలసీలో మరో అంశం.
అవి ముందుకురాని పక్షంలో వేలం ద్వారా పెద్ద సంస్థలకు ఈ బాధ్యత ఇస్తారు. కొత్త పాలసీతో ప్రజలకు ఇసుక కష్టాలు తొలగినట్లే.. ఇది ఓ శుభవార్త అని చెప్పాలి.

Related Posts