లెఫ్ట్ పార్టీలు రూటు మార్చాయి. ఇన్నాళ్లూ ప్రజాసమస్యలపై పోరాడిన లెఫ్ట్ పార్టీలు ఇకపై గెలుపు కోసమే అడుగులు వేస్తున్నట్లు కన్పించాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ ఇదే దారిలో పయనిస్తుందని చెప్పవచ్చు. సీపీఐ నేత రామకృష్ణ ఫక్తు పార్టీని టీడీపీ అనుబంధ సంస్థగా మార్చేశారన్న విమర్శలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. నిజానికి లెఫ్ట్ పార్టీలు ఇప్పటి వరకూ అధికార పార్టీ వైపు ఎప్పుడూ లేకపోయినా ప్రజాసమస్యలపై దృష్టిపెట్టేవి.2019 ఎన్నికల్లో సీపీఐ జనసేనతో జట్టు కట్టింది. అయితే ఒక్క స్థానంలోనూ గెలవలేకపోవడం, పవన్ కల్యాణ్ తన దారి తాను చూసుకోవడంతో సీపీఐ రామకృష్ణ తెలుగుదేశం పార్టీతో జత కట్టాలని భావించారు. అందుకు అమరావతి రాజధాని సమస్యను ఎంచుకున్నారు. రాజధానిలోనే అన్నీ ఉండాలని ఆయన చెప్పడంతో సీమలోని సీపీఐ విభాగంలో వ్యతిరేకత వ్యక్తమయింది. ముఖ్యంగా కర్నూలు జిల్లా నేతలు కర్నూలు లో న్యాయరాజధాని ఉండాలని తీర్మానం చేయడం విశేషం.అయితే సీపీఐ నేత రామకృష్ణ ఎక్కడా తగ్గడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ తెలుగుదేశం పాటనే ఆయన కూడా అందుకున్నారు. మరో పక్షమైన సీపీఎం ప్రభుత్వంతో సంప్రదించాలని చెబితే, సీపీఐ మాత్రం తిరిగి ఫ్రెష్ గా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించాలని కోరడం విశేషం. అయితే సీపీఐ రామకృష్ణ ముందుచూపుతోనే వ్యవహరిస్తున్నారని అర్ధమవుతుంది. పార్టీకి భవిష్యత్ ఉండాలంటే తెలుగుదేశం పార్టీతో చెలిమి తప్పనిసరి అని ఆయన డిసైడ్ అయ్యారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎటూ పొత్తులతోనే ముందుకు వెళతారు. తొలి నుంచి తమతో ఉన్న సీపీఐకి చంద్రబాబు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు. జగన్ పై వచ్చే వ్యతిరేకత సీపీఐకి శాసనసభలో ప్రాతినిధ్యం దొరుకుతుందని రామకృష్ణ అంచనా వేస్తున్నారు. చంద్రబాబుతో బీజేపీ, జనసేన కలిసే అవకాశాలు తక్కువగా ఉండటంతో తామే ప్రధాన మిత్రపక్షంగా వ్యవహరించవచ్చన్నది ఆయన దూరాలోచన. అందుకే సీపీఐని టీడీపీకి అత్యంత చేరువ చేసే పనిలో ఉన్నారు రామకృష్ణ. మరి ఆయన స్ట్రాటజీ వర్క్ అవుట్ అయితే వచ్చే ఎన్నికల్లో సీపీఐ కొన్ని స్థానాలైనా దక్కించుకుంటుందో? లేదో? చూడాలి.