కరోనా పాజిటివ్ వచ్చిందా..? ఇంకేముంది రెగ్యులర్‌గా చెప్పే డోలో.. అజిత్రోమైసిన్ వేసుకుందాం.. ఇవి ఇప్పుడు ప్రతిఒక్కరూ మాట్లాడుకుంటున్న మాటలు. కానీ అసలు కరోనాకు ప్రస్తుతం డాక్టర్లు ఇస్తున్న ట్రీట్‌మెంట్ ఏంటి..? ఏ మందులతో కరోనాను కంట్రోల్ చేయగలుగుతున్నారు..? అవి ఎంతవరకు పని చేస్తున్నాయి..?మొదట్లో ఉన్నంత కరోనా భయం.. ప్రస్తుతం ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతిఒక్కరూ సొంత వైద్యం చేసుకుంటూ ఇంట్లోనే ఐసోలేట్ అవుతున్నారు. అంతేకాదు మెడిసిన్స్ కూడా ఇంట్లోనే ఉండి ఆస్పత్రులకు వెళ్లకుండా.. జ్వరం ఉంటే రోజుకి రెండు పూటలు డోలో 650, జ్వరంతో పాటుగా దగ్గు కూడా ఉంటే రెండు పూటలా అజిత్రోమైసిన్ వేసేసుకుంటున్నారుఇంకా వీటి తీవ్రత పెరిగి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి పరుగు తీస్తున్నారు. అయితే ఇదంతా మైల్డ్ పేషెంట్స్‌కి సరిపోతుంది కానీ.. కొంచెం మోడరేట్, సివియర్ పేషెంట్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవి పరిష్కారాన్ని చూపించవంటున్నారు వైద్యులు.కరోనా వచ్చిన తరువాత బాధితులల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే అసింప్టమాటిక్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. లేదా కొంతమందిలో చాలా మైల్డ్ సింప్టమ్స్‌తో తగ్గిపోతోంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో ముఖ్యంగా మాత్రం జ్వరంతో పాటు మరేమైనా ఇబ్బందులుంటే నిర్లక్ష్యం తగదంటున్నారు డాక్టర్లు. వీరిలో సాచ్యురేషన్ లెవల్స్ 95కి తక్కువగా ఉన్నాయంటే మాత్రం వీరికి కొంతమేర ఆక్సిజన్ అవసరం ఉంటుందని చెబుతున్నారు.90-95 కి సాచ్యురేషన్ లెవల్స్ పడిపోతే ఆరు నిమిషాలు నడిచి ఆ తరువాత మరోసారి సాచ్యురేషన్ చూసుకోవాలని.. అప్పుడు 80కి తక్కువగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. ఆ సమయంలో కూడా సొంత వైద్యం చేసుకోవద్దని సూచిస్తున్నారు.అయితే సివియారిటీ పెరిగిన రోగులకే తాము మందుల డోస్ పెంచి ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. ప్రస్తుతం కరోనాకి ప్రత్యేకంగా మెడిసిన్ లేకపోవడంతో రెమిడెసివర్, కొన్ని రకాల స్టిరాయిడ్స్ వాడుతున్నామని చెబుతున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారిలో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి వారికి రక్తం గడ్డ కట్టకుండా హెపారిన్ ఇన్‌జెక్షన్ ఇచ్చి తగ్గించేస్తున్నామని అంటున్నారు.అంతేకాకుండా రెమిడెసివర్, మిథేల్ ప్రెడ్నిసలోన్, యాంటి వైరల్స్ ఇచ్చి తగ్గిస్తున్నామని చెబుతున్నారు. అయితే కరోనాకి వాడుతున్న మెడిసిన్ కేవలం ఆయా ఆరోగ్య సమస్యలకు ఊరటనిచ్చేవే గాని పూర్తిగా వైరస్‌ని తుదముట్టించేవి కాదనే విషయాన్ని ప్రతొక్కరూ గుర్తుపెట్టుకోవాంటున్నారు వైద్యులు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కువగా రెమిడెసివర్ ఎక్కువగా వినియోగంలో ఉన్న మెడిసిన్ అని.. వాటితో పాటు సివియారిటీ ఎక్కువగా ఉన్న కేసులకు స్టిరాయిడ్స్ కూడా వాడుతున్నామని చెబుతున్నారు.