YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం విదేశీయం

7 సాయంత్రానికి అమెరికా ఫలితం

7 సాయంత్రానికి అమెరికా ఫలితం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి అతి చేరువలోకి వచ్చేసిన డెమాక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అధికారానికి ఒక్క రాష్ట్రం ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్నారు. ఒక్క అడుగు అనే తెలుగు సినిమాలో పవర్ పుల్ డైలాగును ప్రతిబింబిస్తూ 264 ఓట్లు సాధించిన బైడెన్ విజయానికి కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. మేజిక్ మార్కు అయిన 270 ఓట్లకు అత్యంత చేరువలోకి వచ్చిన జో విజయం ఇక లాంఛనప్రాయమేనని అమెరికా గ్రహించింది. మరోవైపు గురువారం రాత్రి వరకు 214 ఎలక్టోరల్ ఓట్ల వద్దే ఉండిపోయిన డొనాల్డ్ ట్రంప్ మోసం జరిగిందంటూ కోర్టు గుమ్మం తొక్కుతున్నా ఆయన ఓటమి తప్పదని అభిమానులకు సైతం అర్థమై చప్పబడిపోయారు.ముఖ్యమైన విస్కాన్సిన్, మిషిగాన్‌ రాష్ట్రాల్లో విజయం సాధించడం బైడెన్‌కు అనుకూలించింది. మరోవైపున కౌంటింగ్‌ కొనసాగుతున్న పలు కీలక రాష్ట్రాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నందున తుది ఫలితం తమకే అనుకూలంగా వస్తుందని రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ బృందం ఆశాభావంతో ఉంది. జో బైడెన్‌కి ఇంతవరకు ఎన్ని ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయనే విషయంలోనూ అమెరికా మీడియాలో అయోమయం ఏర్పడింది. అరిజోనా ఫలితాన్ని ఇంకా నిర్ధారించలేదు కాబట్టి అక్కడి 11 ఎలక్టోరల్ ఓట్లను లెక్కించకుండా బైడన్‌కి 255 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయని సీఎన్ఎన్ పేర్కొంది. అదేసమయంలో అరిజోనాలో 86 శాతం కౌంటింగ్ తర్వాత బైడన్ 68 వేల మెజారిటీతో ఉన్నారని తేలిపోయిన నేపథ్యంలో మెజారిటీ మీడియా సంస్థలు అరిజోనాను బైడెన్ ఖాతాలో కలిపేశాయి. పైగా జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరొలినా, నెవడా, అలస్కాల్లో ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.ఒకవైపు జో బైడన్ కౌంటిగ్ మొత్తంగా ముగిసి, పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాతే విజేతగా భావిస్తానని, అమరికా అధ్యక్షుడిగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని జో బైడెన్ నమ్రతతో ప్రకటిస్తే మరోవైపు ట్రంప్ మాత్రమే కాకుండా ఈ వారాంతానికి ఈ దేశానికి అధ్యక్షుడుగా మరో నాలుగేళ్లు ట్రంపే ఉంటారని స్పష్టమవుతుంది అని ట్రంప్‌ ప్రచార బృందంలోని జేసన్‌ మిల్లర్‌ వ్యాఖ్యానించారు. దీనికి కారణం కూడా ఉంది. కీలకమైన పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు కాబట్టి బైడెన్‌ ఆధిక్యతలో ఉన్నవాటిలో ఒక్క రాష్ట్రాన్నైనా చేజిక్కించుకుంటే.. ట్రంప్ విజయం సాధ్యమవుతుందని విశ్లేషకులు, మద్దతుదారులు పేర్కొంటున్నారు.ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ ద్వారా తనకు విజయం దక్కకపోతే, చివరి చాన్సుగా కోర్టులో పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ ఇప్పటికే నిర్ణయించారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో ఆయన కేసులు వేశారు. కౌంటింగ్‌ను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టులను అభ్యర్థించారు. ఈ దిశగా సుప్రీంకోర్టులోనూ ఆయన కేసు వేశారు. పైగా విస్కాన్సిన్‌లో ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో తేడా 1 శాతం లోపే ఉన్నందున రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసే చట్టబద్ధ అవకాశం ట్రంప్‌నకు ఉంది. కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలించే అవకాశం తమకు ఇవ్వలేదని ఆరోపిస్తూ.. మిషిగన్‌లో కౌంటింగ్‌ నిలిపేయాలని ట్రంప్‌ ప్రచార బృందం స్థానిక కోర్టులో కేసు వేసింది.  ఇలాంటి సాంకేతిక కారణాల వల్లే ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ బైడెన్‌కే వచ్చినట్లు స్పష్టమవుతున్నా తానే విజేత అని ప్రకటించడానకి మీడియాకు కూడా సాధ్యపడలేదు. శనివారం నాటికి వివాదం కొలిక్కి వచ్చి తుది ఫలితాలను ప్రకటిస్తే అమెరికా అధ్యక్ష పదవి చుట్టూ ఉన్న చిక్కుముడులు సమసిపోతాయి కానీ, అలా జరగకపోతే సుదీర్ఘ కాలం న్యాయ వివాదాలు తప్పవు.

Related Posts