కదిరి మండలంలోని యర్రదొడ్డి గ్రామానికి సిసిరోడ్డు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. యర్రదొడ్డి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి
హామీ పథకం కింద 9 లక్షల రూపాయలతో 304 మీటర్ల మేర సిసి రోడ్డును మంజూరు చేసినట్లు తెలిపారు.
గత నెల అక్టోబర్ 27వ తేదీన జిల్లా కలెక్టర్ కదిరి మండలంలోని రామదాసు
నాయక్ తాండాలో పర్యటన సందర్భంగా 28వ తేదీన ఉదయం కదిరి మండలంలోని బోడె నాయక్ తాండా, మీటే నాయక్ తాండా, యర్రదొడ్డి గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఆయా
గ్రామాలలో ప్రజల నుంచి దాదాపు 67 సమస్యలపై జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తులు వచ్చాయి. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ఇంటి పట్టాలు, భూమి సమస్యలు, రుణాల
మంజూరు తదితర సమస్యలను ఆయా గ్రామాల ప్రజలు తెలియజేశారు. అందులో భాగంగా యర్రదొడ్డి గ్రామానికి సీసీరోడ్డు మంజూరు చేయాలని పలువురు గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి
చేయగా, సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. వెంటనే యర్రదొడ్డి గ్రామానికి సీసీరోడ్డు మంజూరుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ అధికారులకు జిల్లా కలెక్టర్
ఆదేశాలు జారీ చేశారు..
యర్రదొడ్డి గ్రామంలో 304 మీటర్ల పొడవున సీసీరోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పంచాయతీ రాజ్ శాఖ
అధికారులు రూపొందించిన ప్రతిపాదనలను ఆమోదించి, సి సి రోడ్డును మంజూరు చేస్తూ కలెక్టర్ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా యర్రదొడ్డి గ్రామ ప్రజలకు ఇచ్చిన
హామీని కలెక్టర్ నెరవేర్చి, వారి సమస్యను పరిష్కరించారు.
అలాగే రామదాసు నాయక్ తాండా, బోడె నాయక్ తాండా, మీటే నాయక్ తాండా, యర్రదొడ్డి గ్రామ ప్రజలు విన్నవించిన 67
సమస్యలకు సంబంధించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల పర్యటనలో సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల
మేరకు ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.