మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీకి గొంతుక వంటి వారు. ఆయన ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతారు. ఆయన మాటల్లో ఖచ్చితత్వం ఉంటుంది. అలాంటి ధర్మాన ప్రసాదరావు కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై కూడా ఆయన స్పందించడం లేదు. ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు మౌనంగా ఉండటం పార్టీకి శ్రేయస్కరం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మాన వంటి వారు గొంతు విప్పడం అవసరం.రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ప్రభుత్వం రాసిన లేఖ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై జాతీయ మీడియా సయితం రోజూ ఏదో ఒక వార్తను ప్రచురిస్తుంది. ఇక మేధావులు, న్యాయవాదులు సయితం తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మాత్రం మౌనంగా ఉన్నారు.అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేస్తుంది. దీనిపై జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇప్పటికే ఉండవల్లి వంటి వారు జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు. ఈ సమయంలో ధర్మాన ప్రసాదరావు వంటి నేతలు పెదవి విప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన మాత్రం మౌనంగానే ఉంటున్నారు. కీలక సమయాల్లో ధర్మాన ప్రసాదరావు హ్యాండ్ ఇవ్వడంపై వైసీపీలో చర్చ జరుగుతోంది.ధర్మాన ప్రసాదరావు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గంలో చోటుదక్కక పోవడమే ప్రధాన కారణం. తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇవ్వడంతో ధర్మాన ప్రసాదరావు పార్టీ అధినాయకత్వంతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఆ మధ్య జిల్లాల ఏర్పాటుపై తన అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాన ప్రసాదరావు తర్వాత కన్పించకుండా పోయారు. మొత్తం మీద ధర్మాన ప్రసాదరావు మౌనం వైసీపీలో హాట్ టాపిక్ గామారింది.