ఏడుకొండలపై తిరుమల వెంకన్న దర్శనం సరే.. కానీ భక్తులు మాత్రం కోవిడ్ రూల్స్‌ని గాలికొదిలేస్తున్నారు. శ్రీవారి దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో నిబంధనలకు ఎగనామం పెడుతున్నారు. భక్తుల అత్యుత్సాహం కొండపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. త్వరలో ఆర్జిత సేవలు ప్రారంభిస్తున్న వేళ.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. టీటీడీ రూల్స్ కఠినంగా అమలు చేయకుంటే తిరుమల కొండపై కరోనా విజృంభిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.అవును తిరుమల కొండపై కరోనా ప్రభావం పొంచి ఉంది. వేలాదిగా తరలివస్తున్న భక్తుల్ని కంట్రోల్ చేయకపోతే కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉంది. భక్తుల రద్దీ రోజు రోజుకీ పెరుగుతుండడంతో భౌతిక దూరం అనే మాటే కొండపై కనిపించడంలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వైరస్ విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా క్యూ కడుతున్నారువారం రోజుల నుంచి గోవిందుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజుకు 22 వేల నుంచి 27 వేల వరకూ ఉంటోంది. దీనికి తోడు తిరుపతి అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్‌లో ప్రారంభించిన సర్వదర్శనం టోకెన్ల జారీతో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. దీంతో కొండపై ఇప్పుడు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు.కొండపై అన్ని ప్రాంతాలలో భక్తులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.తలనీలాలు సమర్పించే శ్రీవారి కళ్యాణ కట్ట, అన్న ప్రసాద కేంద్రం, లడ్డు కౌంటర్‌ల వద్ద భక్తుల మధ్య భౌతిక దూరం అస్సలు కనిపించడం లేదు. కళ్యాణకట్ట, లడ్డూకౌంటర్లు, అన్నప్రసాదంలో భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా టీటీడీ చర్యలు తీసుకున్నప్పటికీ .. భక్తులెవరూ దాన్ని ఫాలో కావడం లేదు. లాక్‌డౌన్ కు ముందు తిరుమలలో పరిస్థితి ఎలా ఉండేదో ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కొండపై కనిపిస్తున్నాయి.క్యూ లైన్‌లలోనూ ఒకరినొకరు తోసుకుంటున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వైరస్ కు అడ్డూ అదుపు లేకుండా పోతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలకు పూర్వ వైభవం వచ్చిందని సంబరపడేలోపే .. భక్తుల తీరుతో కోవిడ్ మహమ్మారి ఎక్కడ విజృంభిస్తుందోనని ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే వైరస్ సెకండ్ వేవ్ వస్తుందన్న నిపుణుల హెచ్చరికలు ఎక్కడ నిజమవుతాయోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.