YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

4 లక్షల కోట్లకు చేరిన అప్పు...

4 లక్షల కోట్లకు చేరిన అప్పు...

రాష్ట్ర  ఖజానా గాడి తప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు కూడా కటకట అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచీ చేబదులు నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది.
మార్కెట్  లోన్లతోపాటు అడ్డగోలుగా చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు తిప్పలు పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు మోతాదుకు మించిపోవటంతోనే  ఈ పరిస్థితి తలెత్తింది.ఆర్బీఐ
నుంచి చేబదులు తెచ్చిన నిధులను నెలనెలా తిరిగి చెల్లించలేని సంక్షోభంలో  రాష్ట్ర సర్కార్ చిక్కుకున్నది. దీంతో కొంతకాలంగా రాష్ట్రానికి అప్పులిచ్చేందుకు రుణ దాతలు ముందుకు రావటం లేదు.

అప్పులిస్తామని మాటిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వెనుకాడుతున్నాయి. కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఆదాయం ఆరేండ్లకే పడిపోతున్నదన్న సందేహాలు మొదలయ్యాయి.డబ్బుల్లేకపోతే ఆర్బీఐ నుంచి చేబదుళ్లు తెచ్చుకునే వెసులుబాటు అన్ని రాష్ట్రాలకు ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో జీతాలు, ఆఫీసుల నిర్వహణతోపాటు పెన్షన్లు, స్కీమ్‌‌లు ఆగకుండా ఉండేందుకు చేబదులు తప్పదని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ.. చేబదులు చేసే లిమిట్‌‌ దాటిపోతే రాష్ట్ర ప్రభుత్వం పరపతి అంతకంతకు తగ్గిపోతుందని వారు అంటున్నారు. సాధారణంగా రాష్ట్రాలు ఆర్‌‌బీఐ నుంచి వేస్ అండ్ మీన్స్ పేరిట డబ్బును చేబదులు తెచ్చుకుంటాయి. ఆదాయం సమకూరగానే  వారం నుంచి  పది రోజుల్లో తిరిగి చెల్లిస్తాయి.

అయితే.. జూన్, జులై, ఆగస్టు మూడు నెలల్లో సగటున రూ. 1,200 కోట్లు ఆర్‌‌బీఐ నుంచి తెలంగాణ చేబదులు తెచ్చుకుంది. జులై, ఆగస్టులో వీటిని తిరిగి తీర్చలేకపోయింది. వేస్ అండ్ మీన్స్‌‌కి మించి డబ్బులు అవసరం కావటంతో
ఆర్‌‌బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ పేరుతో మరింత డబ్బు తీసుకుంది. జులై లో రూ. 286 కోట్లు, ఆగస్టులో రూ. 756 కోట్లు ఓడీ తీసుకుంది. అంటే హద్దులు మీరి రాష్ట్ర ప్రభుత్వం చేబదులు చేస్తున్న తీరు ఖజానా డొల్లతనాన్ని బయటపెట్టింది. ఆదాయ వ్యయ నిర్వహణలో క్రమ శిక్షణ పాటించకపోవటం,  ఇష్టమొచ్చినట్లు అప్పులు తీసుకురావటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు స్పష్టమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ. 4 లక్షల కోట్లు దాటాయి. అధికారికంగా ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఆరేండ్లలో రూ. 1.88 లక్షల కోట్ల అప్పులు చేసింది.

ఇవి కాకుండా బడ్జెట్తో సంబంధం లేకుండా  కార్పొరేషన్ల ద్వారా ఇరిగేషన్‌‌, ఎలక్ట్రిసిటీ  తదితర ప్రాజెక్టుల కోసం అంతకుమించి అప్పులు తెచ్చింది. వీటన్నింటికీ ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి  రుణ సమీకరణ చేసింది. ఇలా తెచ్చిన అప్పులు రూ. 2.58 లక్షల
కోట్లకు పైగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1.54 లక్షల  కోట్ల అప్పులున్నాయని, గడిచిన ఐదేండ్లలో రూ. 34,296 కోట్లు రీ  పే చేశామని ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావు ప్రకటించారు. ఈ లెక్కన చూసుకున్నా  రూ.4.12 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. మరోవైపు కరోనా కారణంగా రాష్ట్ర ఖజనాకు రాబడి భారీగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను కోత పెట్టడంతో
పాటు  పనులు, పాత బిల్లులన్నీ ప్రభుత్వం ఆపేసింది.  అమల్లో ఉన్న స్కీమ్లకు నిధులు విడుదల చేయటం కూడా సవాల్‌‌గా మారింది. అప్పటివరకు భారీగా అప్పులు తెచ్చి ప్రియారిటీపై చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కనపెట్టింది.  కానీ దుబ్బాక ఉప ఎన్నిక రావటంతో మళ్లీ అప్పులు, చేబదులు నిధులతోనే  ప్రభుత్వం హడావుడి చేసింది.

ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, రైతు వేదికలకు నిధులతోపాటు , ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెట్టిన జీతాలను విడతల వారీగా చెల్లింపులను ప్రారంభించింది.కరోనా టైమ్లో.. ఆదాయానికి లోటు లేదని, సర్కారుకు సామార్ధ్యం ఉంది కాబట్టి  అప్పులు
వస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులకు లోన్‌‌ లింకేజీ ఉంది కాబట్టి ప్రాజెక్టులు నిర్మించి తీరుతామన్నారు. కానీ కొన్ని నెలల్లోనే  సీన్‌‌ రివర్స్‌‌  అయింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 6 వేల కోట్లు, కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీకి రూ. 14 వేల కోట్ల అప్పులు ఇవ్వబోమని పవర్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌, రూరల్‌‌ ఎలక్ట్రిఫికల్‌‌ కార్పొరేషన్లు తేల్చిచెప్పాయి.

బ్యాంకుల కన్సార్షియం కూడా ఇప్పట్లో ఎలాంటి లోన్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల పనులు చేసిన వర్క్‌‌ ఏజెన్సీలకు బకాయి పడ్డ రూ. 10 వేల కోట్ల పేమెంట్లను ప్రభుత్వం ఆపేసింది.
ఈ ఫైనాన్స్‌‌ ఇయర్‌‌లో పేమెంట్‌‌ చేయలేమని తేల్చిచెప్పింది. ఇతరత్రా లోన్లు రాకపోవడంతో నాబార్డ్‌‌  ద్వారా రుణ సమీకరణ చేసి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులతోపాటు జీవన ప్రమాణాలు పెంపొందించే కార్యక్రమాలపై సర్కారు ఫోకస్‌‌ చేసింది. అదే సమయంలో సర్కారు బాండ్లను వేలం వేయడం ద్వారా నెలకు రూ. 4 వేల కోట్ల వరకు అప్పులు తెచ్చి ఆ మొత్తంతో బండి లాగిస్తున్నది.
సర్కారుకు సమకూరే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నది.

Related Posts