రాష్ట్ర ఖజానాపై కరోనా కాటేసింది. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు, పన్నేతర ఆదాయాల తీరును పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సెప్టెంబరు నాటి గణాంకాలు... స్టాంపులు, రిజిస్ట్రే షన్లలో గణనీయమైన తగ్గుదలను సూచిస్తున్నాయి. ఈ రూపంలో ఖజానాకు రూ.1,657 కోట్ల ఆదాయం సమకూరగా.. సర్కారు వేసుకున్న అంచ నాల్లో ఇది 16.57 శాతంగా నమోదైంది. గతేడాది సెప్టెంబరుతో సరిపోల్చి చూస్తే... ఈ ఆదాయం 45 శాతం మేర తగ్గింది. అప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో 51.56 శాతం మేర ఆదాయం వచ్చింది. దీంతోపాటు నిధుల సమీకరణ లో భాగంగా భూములను విక్రయించాలని భావించిన సర్కారుకు చుక్కెదురైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో సెప్టెంబరు నాటికి కేవలం 22 లక్షలు మాత్రమే ఈ రూపంలో ఖజానాకు చేరాయి. అప్పులను పరిశీలిస్తే... మొత్తం ఏణ్నెల్ల కాలంలో రూ.25,989 కోట్ల రుణాలను సర్కారు స్వీకరించింది. 2019 సెప్టెంబరుతో పోలిస్తే ఈ విషయంలో 17 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు పన్నేతర ఆదాయం మాత్రం భారీగా తగ్గింది. ఈ రూపంలో గతేడాది రెండో త్రైమాసికం (2019 సెప్టెంబరు) నాటికి మొత్తం బడ్జెట్ అంచనాల్లో 13.89 శాతం ఆదాయం రాగా.. ఈసారి అదే కాలానికి మాత్రం 5.04 శాతం ఆదాయమే రావటం గమనార్హం. అమ్మకపు పన్ను విషయంలోనూ ఇదే స్థితి కొనసాగుతున్నది. గతేడాది సెప్టెంబరు నాటికి మొత్తం అంచనాల్లో 42.55 శాతం ఆదాయం రాగా ఈ సంవత్సరం మాత్రం 30.87 శాతంగానే అది నమోదైంది. వీటన్నింటి ఆధారంగా కరోనా... రాష్ట్ర ఖజానా, ఆదాయం, రాబడులపై తీవ్రమైన ప్రభావానే చూపింది. ఇది ఇంకో ఆర్నెల్లపాటు ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేశాయి.
2020 సెప్టెంబరు నాటికి రాష్ట్ర ఖజానా పరిస్థితి...(రూ.కోట్లలో)
అంశం రాబడి బడ్జెట్ అంచనాల్లో శాతం
వస్తు సేవల పన్ను 10,437 31.95
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు 1,657 16.57
భూముల అమ్మకాలు 0.22 3.17
అమ్మకపు పన్ను 8,148 30.87
ఎక్సైజ్ సుంకాలు 6,285 39.29
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 3,753 34.41
ఇతర పన్నులు, సుంకాలు 1,475 24.43
పన్నేతర ఆదాయం 1,542 5.04
గ్రాంట్లు, ఇతర సాయాలు 4,649 44.17
లోన్లు, అడ్వాన్సులు 31 62
అప్పులు, ఇతరాలు 25,989 78.30