తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చోటు లభించడం ఒక అదృష్టంగా భావిస్తారు. టీటీడీ చైర్మన్‌లుగా పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికులకు చోటు లభించింది. ఇప్పటిదాకా నలుగురు చైర్మన్‌లు జిల్లా నుంచే వెళ్లారు. బోర్డు సభ్యులుగా ఎందరో అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక పర్యాయం పూర్తిచేసి రెండోసారి టీటీడీ పాలకవర్గాన్ని వేశారు. రెండింటిలోనూ జిల్లాకు ప్రాతినిథ్యం లభించలేదు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహించడంతో టీటీడీ ట్రస్ట్ బోర్డ్‌లో జిల్లాకు ప్రాధాన్యం లభించలేదన్న వాదన వినపడింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టీడీపీ, బీజేపీ తెగదెంపులు చేసుకున్నాయి.
దేవాదాయ శాఖ మంత్రి పదవి నుంచి మాణిక్యాలరావు వైదొలిగారు. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకవర్గ చైర్మన్ పదవిని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. ఫలితంగా టీటీడీ పాలకవర్గంలో జిల్లాకు ప్రాతినిథ్యం లభిస్తుందన్న ఉద్దేశంలో జిల్లా వాసులు ఉన్నారు. దీనిపై ఒకింత ఉత్కంఠత నెలకొంది. అందుకు కారణం లేకపోలేదు. పాలకవర్గంలో స్థానం ఉంటే టీటీడీ దర్శనం సిఫారుసులో కాస్త సునాయాసమవుతుందన్న భావన జిల్లాప్రజల్లో ఉంది. గతంలో టీటీడీ చైర్మన్‌గా కనుమూరి బాపిరాజు వ్యవహరించినప్పుడు జిల్లా నుంచి ఎవరు వెళ్లినా వెంకన్న దర్శనం ప్రత్యేకంగా లభించేది. టీటీడీ సభ్యునిగా గోకరాజు రామం ఉన్నప్పుడు కూడా సిఫారసు లేఖలతో దర్శనం చేసుకుని వచ్చేవారు. అదే ఇప్పుడు జిల్లా ప్రజల్లో టీటీడీ పాలకవర్గంపై ఉత్కంఠకు కారణమైంది. దేవదాయ శాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు ఉన్నప్పుడు స్థానికం గా టీడీపీ, బీజేపీలకు సఖ్యత లేకుండా పో యింది. ఫలితంగా తాము నియోజకవర్గంలో టీటీడీ లెటర్‌కు కూడా మంత్రి నుంచి నోచుకోలేకపోతున్నామంటూ టీడీపీ వర్గాలు తమ నేతల వద్ద ఆవేదన వెలిబుచ్చేవారు. తిరుమల తిరుపతి దేవస్థానమంటే జిల్లాలో అంతటి ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా టీటీడీ పాలక వర్గ చైర్మన్ పదవిని భర్తీ చేయడంతో అందరి చూపు పాలకవర్గంపై ఉంది.
గతంలో టీటీడీ పాలకవర్గంలో జిల్లాకు సముచిత స్థానం లభించేంది. గోకరాజు రంగరాజు, కలిదిండి అబ్బాయిరాజు, కనుమూరి బాపిరాజు, వేగేశ్న కనకరాజులు చైర్మన్‌లుగా వ్యవహరించారు. గోకరాజు రామం రెండు పర్యాయాలు డైరెక్టర్ పదవిలో సేవలందించారు. బాపిరాజును మూడేళ్ల పాటు చైర్మన్ పదవి వరించింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇప్పటిదాకా ఒక పాలకవర్గం సేవలందించింది. ఆ రెండింటిలోనూ జిల్లాకు చోటు లభించలేదు. ప్రస్తుత రాజకీయ సమీకరణల్లో జిల్లాకు తప్పనిసరిగా చోటు లభిస్తుందన్న ఆశ అందరిలోనూ ఉంది. అందుకు తగ్గట్టుగానే జిల్లాలో ఆశావహులు ఉన్నారు.
గత పాలకవర్గంలో తొలుత జిల్లా నుంచి మాజీ ఎంఎల్‌ఎ వై.టి.రాజా పేరును తొలుత ప్రకటించారు. అనంతరం సామాజిక, ప్రాంతాల వారీ సమతుల్యతలో అనూహ్యంగా వై.టి.రాజా పేరును తొలగించారు. ఆయన టీడీపీలో క్రియా శీలకంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే రేసులో తాను లేనంటూ స్వతంత్రంగా ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే ఆయనకు టీటీడీ ట్రస్ట్‌బోర్డులో ప్రాతినిథ్యం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఈ సారైనా వస్తుందన్న భావన ఆయన అనుచర వర్గంలో ఉంది. అలాగే గతంలోనే జిల్లా నుంచి పార్టీ పరంగా గాది రాజుబాబు, ఈలినాని పేర్లు సిఫారసు చేశారు. గాదిరాజు బాబు తొలినుంచీ పార్టీలో ఉంటూ సేవలందిస్తున్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల హయాంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించడంతో చంద్రబాబు ప్రత్యేకంగా ఈలి నానికి తగిన అవకాశం ఇవ్వనున్నట్టు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం టీటీడీ ఆశావహుల్లో ప్రధానంగా వై.టి.రాజా, గాదిరాజు బాబు, ఈలినాని ఉన్నారు. ఈసారి పశ్చిమకు టీటీడీ ట్రస్ట్ బోర్డ్‌లో అవకాశం ఇవ్వనుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.