YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డాక్టర్లు లేకుండా వైద్యం ఎట్లా..?

  డాక్టర్లు లేకుండా వైద్యం ఎట్లా..?

 

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్యులు సరిపడా లేక కష్టం వచ్చింది.. ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్య సేవల కోసం వస్తున్నారు... ఒకప్పుడు 300 నుంచి 400 ఉండే సాధారణ ఓపీ ప్రస్తుతం 1000 నుంచి 1200లకు చేరింది.. స్త్రీ వైద్య నిపుణుల విభాగానికి వస్తే ప్రతిరోజు 40 నుంచి 60 మంది వైద్యం కోసం వచ్చేవారు.. ప్రస్తుతం రెట్టింపు వస్తున్నారు.. చిన్న పిల్లల విభాగం.. కంటి విభాగం... జనరల్‌ మెడిసిన్‌కు వస్తున్న రోగుల సంఖ్యా పెరిగింది.. వీరికి సరిపడా వైద్యులు లేక ఇబ్బందులు వస్తున్నాయి.. దీంతో ఉన్న వైద్యులపై పనిభారం పెరిగింది.. రాత్రి సమయాల్లో విధులు.. సెలవు సమయాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

పీజీ వైద్య విద్యను అభ్యసించిన సీనియర్‌ రెసిడెంట్‌లు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొనడంతో చాలా మంది సీనియర్‌ రెసిడెంట్‌లు జనరల్‌ ఆస్పత్రిలో విధులకు హాజరు కావడం లేదు. జనరల్‌ మెడిసిన్‌, చిన్న పిల్లల వైద్యం, జనరల్‌ సర్జరీ, స్త్రీ వైద్య నిపుణులు విభాగం, ఈఎన్‌టీ వంటి కీలక విభాగాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ పూర్తిస్థాయి వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది. కంటి వైద్య విభాగంలో అయితే ఒక్క పూర్తిస్థాయి వైద్యుడు కూడా లేరు. కేవలం ఒక ఒప్పంద వైద్యుడు, సీనియర్‌ రెసిడెంట్‌లతో నడుస్తుంది. ప్రస్తుతం వారు కూడా విధులకు హాజరు కాకపోతే విభాగం నిర్వహణ ఇబ్బందే. ప్రధానంగా కేసీఆర్‌ కిట్టు కార్యక్రమం అమలు చేసిన తరవాత కాన్పుల సంఖ్య, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది. ఓపీ చూడటానికి ఇద్దరు వైద్యులు, ప్రసవాలు అయిన వార్డులో వైద్య సేవలు అందించేందుకు మరో ఇద్దరు, ఇక శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు కనీసం ఒకరు లేదా ఇద్దరైనా ఉండాలి. కాని ప్రస్తుతం ఆ విభాగంలో సీనియర్‌ రెసిడెంట్‌ రాకపోగా కేవలం ముగ్గురు వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న వైద్యులకు పనిభారం బాగా పెరిగింది. సీనియర్‌ రెసిడెంట్‌లు ఉన్న సమయంలో ఉదయం సమయంలో పూర్తిస్థాయి వైద్యులు, రాత్రి సమయాల్లో ఎస్‌ఆర్‌లు విధులు నిర్వహించేవారు. కొన్ని విభాగాల్లోనైతే ఎస్‌ఆర్‌లు ఉదయం, రాత్రి విధులు నిర్వహించేవారు. కాని ప్రస్తుతం సీనియర్‌ రెసిడెంట్‌లు లేకపోవడంతో రాత్రి సమయంలో విధుల నిర్వహణకు ఇబ్బంది కలుగుతోంది. ఉన్న వైద్యులు ఉదయం పని చేసి మళ్లీ రాత్రి కూడా అత్యవసర సమయాల్లో విధులకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సెలవు దినాల్లో అయితే అసలు వైద్య నిపుణులు అందుబాటులో ఉండటం లేదు. జనరల్‌ ఆస్పత్రిని పరిశీలిస్తే ఉదయం 11.30 వరకు కూడా కొన్ని విభాగాల్లో రోగులను చూడని పరిస్థితి నెలకొంది. కొన్ని విభాగాల్లో రోగులను చూసేందుకు డాక్టర్లు వైద్య విద్యార్థుల సహాయాన్ని తీసుకుంటున్నారు. డాక్టర్ల సంఖ్యను పెంచకపోతే ఆస్పత్రి నిర్వహణపై ప్రభావం పడటంతోపాటు ప్రజల్లో నమ్మకం సైతం సన్నగిల్లే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సేవలు మెరుగుపడ్డాయనే విషయం ప్రజలకు తెలియడంతో వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రాథమిక, ఏరియా ఆస్పత్రుల నుంచి సైతం రోగులను జనరల్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణులైన వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. కనీసం ఈ ఏడాది కేటాయించిన సీనియర్‌ రెసిడెంట్‌లను వారి ఏడాది కాలం పూర్తయ్యే వరకు ఇక్కడే కొనసాగించే విధంగానైనా చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు ఇతర రెగ్యులర్‌ వైద్యులు ఆస్పత్రికి వచ్చే విధంగా చూడాలి. జనరల్‌ ఆస్పత్రిలోని పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Related Posts