YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కొరతను ‘క్యాష్’ చేసుకుంటున్నారు

   కొరతను ‘క్యాష్’ చేసుకుంటున్నారు

నగదు కొరత ను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. కరెన్సీ లేమిని సాకుగా చూపి స్వైపింగ్‌ చేస్తే వ్యాపారులు రెండు శాతం అదనపు వసూలు చేస్తున్నారు. 2016 నవంబరు 8వ తేదీకి ముందు స్వైపింగ్‌పై ప్రజలకు పెద్దగా అవగాహన లేదు. నోట్ల రద్దు అనంతరం ప్రాధాన్యం పెరిగింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వినియోగించి స్వైపింగ్ మిషన్ సాయంతో నచ్చిన చోట షాపింగ్‌తో పాటు ఇతర సేవలు పొందుతున్నారు. ఒకప్పుడు వీటికి ఎలాంటి ఛార్జీలు తీసుకొనే వారు కాదు. కార్డు దీని కింద జరిగే లావాదేవీలన్నింటికి సంబంధించిన ఛార్జీలన్ని కూడా సంబంధిత వ్యాపారి, నిర్వాహకుడే చూసుకునేవారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలు పెరగటం, నోటు కష్టాలు మొదలవ్వటంతో ప్రతి స్వైపింగ్‌పై వ్యాపారులు 2 శాతం అదనపు వసూలు ప్రారంభించారు. మధ్యలో నోట్ల తిప్పలు తప్పటంతో ప్రజలు దీనిని తగ్గించారు. గత రెండు నెలలుగా మళ్లీ నోటు కష్టాలు మొదలవ్వటంతో తిరిగి స్వైపింగ్‌ చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో వ్యాపారులు ముందుగా 2 శాతం అదనపు వసూలుకి అంగీకరిస్తేనే స్వైపింగ్‌ చేస్తుండటం గమనార్హం.

నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 265 ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులుండగా మరో 251 ఏటీఎం కేంద్రాలున్నాయి. నోట్ల రద్దు అనంతరం రూ.2 వేలు, రూ.500, రూ.50, రూ.10 కొత్త నోట్లను మార్కెట్లోకి తెచ్చింది ఆర్‌బీఐ. అయినప్పటికి జిల్లాలో నగదు కష్టాలు తీరట్లేదు. బ్యాంకుల్లో నగదు తీసుకొనేందుకు వెళ్తే.. ఒకరోజులో కనీసం రూ.5 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చాలా వరకు ఏటీఎంలు నగదు నిల్వలు లేక మూతబడ్డాయి. దీంతో స్వైపింగ్‌పై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. నోట్ల రద్దుకి ముందు జిల్లాలో కేవలం వెయ్యిలోపు మాత్రమే స్వైపింగ్‌ యంత్రాలుండేవి. తదనంతరం వీటి సంఖ్య 8 వేల వరకు చేరిందని బ్యాంకింగ్‌ వర్గాల ద్వారా సమాచారం. ఇటీవల కాలంలో దరఖాస్తు చేసుకొన్న వ్యాపారుల సంఖ్య మరో 5 వేల వరకు ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్వైపింగ్‌కు ఎంత డిమాండ్‌ పెరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో పక్కా నిబంధనల ప్రకారం స్వైపింగ్‌ జరిగేలా లీడ్‌ బ్యాంకు యంత్రాంగం, బ్యాంకర్లు, వ్యాపారులపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.

 గతంలో పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్ పోయించుకొంటే ఎలాంటి బాదుడు ఉండేది కాదు. ప్రస్తుతం బంకుల్లోనూ రూ.వేయి పైబడి జరిపే లావాదేవీపైన 2 శాతం అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం బంకుల్లో జరిపే ప్రతి వంద లావాదేవీపై 90 పైసలు వినియోగదారునికి తిరిగి ఇస్తామని ప్రకటించింది. తొలిరోజుల్లో ఇది అమలు కూడా అయింది. ప్రస్తుతం దీనిపైనా ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది.  నిజామాబాద్‌ నగరంలోని పలు దుకాణాల్లో రూ.500 పైబడి కొనుగోలు లేక షాపింగ్‌ చేస్తేనే స్వైపింగ్‌కు అనుమతిస్తున్నారు. దీనిపైనా 2 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా దుకాణాలు, వ్యాపార సంస్థల్లో ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ పెద్దక్షరాలతో రాసి ఉంచటం కొసమెరుపు.

స్వైపింగ్‌ విషయంలో బ్యాంకర్లు సైతం స్పష్టమైన నిబంధనలను బహిర్గతం చేయట్లేదు. వాస్తవానికి ఎలాంటి అదనపు వసూలు చేయకూడదని గతంలోనే ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే జిల్లా బ్యాంకర్ల నుంచి వ్యాపారులకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు ఎవరికి నచ్చినట్లుగా వారు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫలితంగా అంతిమ భారం వినియోగదారులు మోయాల్సి వస్తోంది.

 

Related Posts