కథువా ఘటనపై భారతీయులందరూ సిగ్గుపడాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ, మనకు స్వాతంత్ర్యం వచ్చిన డెబ్భై ఏళ్ల తర్వాత కూడా చిన్నారులపై ఇలాంటి ఘటనలు జరగడం దారుణం సిగ్గు చేటన్నారు. మన సమాజం ఎటుపోతోందో ఆలోచించుకోవాలని, ఇకపై ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా చూడాలని అన్నారు.ఆడపిల్లలకు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛనిచ్చి, ఇప్పుడు వాళ్లపై పైశాచికత్వం చూపడం అత్యంత దారుణమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, చిన్నారులు సాక్షాత్తూ వైష్ణోదేవి ప్రతిరూపాలని, ఇలాంటి పసిమొగ్గలపై దారుణానికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించుకుంటున్నామో ఆలోచించుకోవాలన్నారు. అటువంటి సంఘటనకు బాలిక కానీ, మహిళ కానీ గురి కాకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత మనకు ఉందన్నారు. బాలల ముఖంపై చిరునవ్వే ఈ ప్రపంచంలో అత్యంత అందమైనదని చెప్పారు. బాలలకు రక్షణ కల్పించడమే మన సమాజానికి గొప్ప విజయమని తెలిపారు. వారికి భద్రత కల్పించి, తమకు రక్షణ ఉన్నదనే భావం వారిలో కల్పించడం సమాజం బాధ్యత అని తెలిపారు.ఈ సందర్భంగా మహిళలు సాధిస్తున్న విజయాలను, వారి వల్ల మన దేశానికి లభిస్తున్న కీర్తి, ప్రతిష్ఠలను రామ్‌నాథ్ కోవింద్ గుర్తు చేశారు. భారతీయ బాలికలు ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో గొప్ప విజయాలు సాధించి, మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చారన్నారు. మానిక బాత్రా, మేరీ కోమ్, మీరాబాయ్ చాను, సంగీత చాను, మను భకర్, వినేష్ ఫోగట్, సైనా నెహ్వాల్, హీనా సిద్దు మన దేశానికి కీర్తి సంపాదించిపెట్టారన్నారు.