YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అయోధ్యలో ఘనంగా దీపోత్సవ్

అయోధ్యలో ఘనంగా దీపోత్సవ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏటా దీపావళి సందర్భంగా అయోధ్యలో 'దీపోత్సవ్'ను ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ సారి మరింత కన్నులపండువగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. ఈ సారి 5.51 లక్షల దీపాలతో దీపోత్సవ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.కొవిడ్‌-19 మహమ్మారి మధ్య దీపావళి వేడుకలను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా జరుపాలని నిశ్చయించారు. దీపోత్సవానికి అన్ని సన్నాహాలు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే అధికారులను కోరారు. వేడుకల్లో భాగంగా అయోధ్యలోని రామ్ కి పైడి ఘాట్ల వద్ద 5.51 లక్షల మట్టి దీపాలను వెలిగిస్తామని సీఎం సమీక్షా సమావేశంలో తెలిపారు. రామ్ జన్మభూమి, బాబ్రీ మసీదు భూమి వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత ఈ దీపోత్సవ్ మొదటిది. వివాదాస్పద భూమి మొత్తాన్ని హిందువులకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునివ్వడంతో హిందువుల సంతోషాన్ని దీపాల రూపంలో ప్రతిబింబించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ మేరకు 5.51 లక్షల దీపాలను వెలిగించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి లేనట్లయితే కోటి మంది ఈ సంవత్సరం దీపాత్సవానికి హాజరయ్యేవారు. "500 సంవత్సరాలు కష్టపడిన తరువాత.. రామ్ మందిర నిర్మాణాన్ని ప్రారంభించడానికి సుప్రీంకోర్టు చివరకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. దీపావళి పర్వదినం సందర్భంగా భక్తులు అయోధ్యకు రావద్దని వేడుకుంటున్నాం. డిజిటల్‌గా ప్రత్యక్ష ప్రసారంలో చూసి ఆనందించండి” అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి నీలకంఠ తివారీ ప్రజలకు సూచించారు. ఈ సంవత్సరం దీపాత్సవంలో 5 లక్షలకు పైగా మట్టి దీపాలు వెలిగిస్తారని, గత 500 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ కార్యక్రమం రామ్ జన్మభూమి ప్రదేశంలో జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. దీపోత్సవ్ 2020 ను ఈ నెల 12 నుంచి 16 వరకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ నేతృత్వంలో రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నది.

Related Posts