టీఆర్‌ఎస్ నాయకులపై ఎంపీ రేవంత్‌రెడ్డి మరోసారి మండిపడ్డారు. వరదసాయాన్ని టీఆర్‌ఎస్ నేతలు పందికొక్కుల్లా తినేస్తున్నారని ఆరోపించారు. వారంతా పేదలను పీక్కుతింటున్నారని, వరదసాయం పంపిణీ నిధుల లెక్క బయట పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వరదసాయం పంపిణీ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్రమాలపై కోర్టుకు వెళ్తే అధికారులు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయం ముందు శనివారం రేవంత్ ఆందోళన నిర్వహించారు.నిజమైన బాధితులకు కాకుండా టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, తమకు నచ్చిన వారికి సాయం చేశారని, అందులోనూ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అక్రమాలపై తాము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్‌లో వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల నగదు సాయం కొందరు నాయకులు బొక్కేస్తున్నారనే ఆరోపణలతో దాన్ని నిలిపివేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. బాధితులకు న్యాయం చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు, బాధితులు ధర్నాలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం పంపిణీ ప్రక్రియను కొన్ని రోజులపాటు నిలిపివేసింది. ఈ పంపిణీ గురువారం నుంచి మళ్లీ ప్రారంభమైంది.