అమెరికా ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల తేదీ రోజున రాత్రి 8 గంటల తర్వాత వచ్చిన బ్యాలెట్లను లెక్కించరాదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సామ్యూల్ అలిటో ఆదేశించారు. చాలా ఆలస్యంగా పోలింగ్ సెంటర్లకు వచ్చిన ఓట్లను లెక్కపెట్టరాదంటూ పెన్సిల్వేనియాలో రిపబ్లికన్లు న్యాయపోరాటానికి దిగారు. నవంబర్ 3వ తేదీన బ్యాలెట్‌ను బట్వాడా చేసినట్లు పోస్టల్ స్టాంప్ ఉన్న బ్యాలెట్లను మరోచోట సమీకరిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల తేదీ రోజున పెన్సిల్వేనియాలో ట్రంప్ లీడింగ్‌లో ఉన్నారు. కానీ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో సీన్ మారింది. ప్రస్తుతం జో బైడెన్ ఆ రాష్ట్రంలో ఆధిక్యంలోకి వచ్చేశారు. సుమారు 22 వేల ఓట్ల మెజారిటీతో బైడెన్ దూసుకెళ్తున్నారు. అయితే అక్కడ రేసు ఇంకా రసవత్తరంగానే కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో ఇప్పుడే విజేతను అంచనా చేయడం అంత సులువు కాదు. ఒకవేళ జో బైడెన్ ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటే, ఆయన ఈజీగా 270 మ్యాజిక్ మార్క్‌ను దాటేస్తారు. దీంతో ఆయన వైట్‌హౌజ్‌కు రూటు క్లియర్ అవుతుంది. కానీ పెన్సిల్వేనియాలో రీ కౌంటింగ్‌ను అడ్డుకోవాలంటే బైడెన్‌కు మెజారిటీలో భారీ తేడా ఉండాల్సి ఉంటుంది. సుమారు లక్ష పోస్టల్ బ్యాలెట్ల, భారీ సంఖ్యలో ప్రొవిజినల్ బ్యాలెట్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. బైడెన్ 253, ట్రంప్ 214 ఓట్లతో అధ్యక్ష రేసులో ఉన్నారు