జనసేన అంటూ ఆరేళ్ల క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆర్భాటంగా ప్రకటించారు. దాంతో ఏపీ రాజకీయాలలో మూడవ ప్రత్యామ్నాయం వచ్చిందని అంతా ఆశపడ్డారు. ఆ ఊపు అలాగే ఉండగా జనసేన పోటీ చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పవన్ కొత్త నినాదాన్ని జనాలకు పరిచయం చేసి తాను మాత్రం టీడీపీ, బీజేపీలకు గట్టి మద్దతుదారుగా మారిపోయారు. ఇక 2019 ఎన్నికల వేళ తొందరపడి ముందే కూసిన కోయిల మాదిరిగా సొంతంగా పోటీ చేసి చేయి కాల్చుకున్నారు. ఇక గత ఏడాదిన్నరగా అసలు జనసేన ఉనికిలో ఉందా అన్న అనుమానాలు ఆ పార్టీ అభిమానులే వ్యక్తం చేస్తున్న స్థితి.జనసేనలో కర్త, కర్మ, క్రియ పవన్ కళ్యాణే. ఆయన హీరో కమ్ పొలిటీషియన్ కాబట్టి పొలిటికల్ స్క్రీన్ మొత్తం ఆయనే కనిపించాలి. అది రూల్ కూడా. సరే ఆయన తరువాత మరో నేత అయినా ఉండాలి కదా. ఆ విధంగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ని పార్టీలో చేర్చుకుని రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ పేరిట ఒక పదవి కట్టబెట్టారు. అలా పవన్ జనసేనని అయితే ఉప సేనానిగా నాదెండ్ల కుదురుకున్నారు. ఆ మధ్య వరకూ ఆయన ఏదో విషయం మీద మాట్లాడుతూనే ఉన్నారు. పవన్ కంటే ముందుగా కొన్ని విషయాల్లో రియాక్ట్ అయి తాను కో పైలెట్ అన్న ఫీలింగ్ మాత్రం క్యాడర్ కి కలిగేలా చేశారు.ఇక పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఏపీ వరకూ చూస్తే బీజేపీ ఏమీ కాదు, జనసేనకు ఉన్నపాటి బలం కూడా ఆ పార్టీకి లేదు, కానీ జాతీయ స్థాయిలో మోడీకి ఉన్న పొలిటికల్ గ్లామర్ తో బండి లాగిస్తోంది. ఆ వెలుగులోనే తామూ వెలిగిపోదామన్నది జనసేన అధినాయకత్వం అత్యాశ. మరో వైపు పవన్ కళ్యాణ్ ని అడ్డం పెట్టుకుని కాగల కార్యాలన్నీ నెరవేర్చుకుందామని కమలనాధుల కమ్మని కలలు అలా సాగుతున్నాయి. ఈ దాగుడుమూతల మధ్యన అన్నీ బీజేపీ మీదనే భారం అంటూ పవన్ సినిమాల కోసం మేకప్ వేసుకున్నారు. ఇక బీజేపీ జనసేన కూటమి కాబట్టి ఆ పార్టీ ఏపీలో సందడి చేస్తే తాము చేసినట్లేనని పవన్ భావిస్తున్నట్లున్నారు. దాంతో ఆయన రాజకీయాన్ని మెల్లగా పక్కన పెట్టారని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఏమీ లేని చోట తానెందుకు అని నాదెండ్ల మనోహర్ మదన పడుతున్నారుట.ఇక జనసేనలో పవన్ ఒక్కరి పేరే చెబుతారు. మరోసారి ఆలోచించమంటే కచ్చితంగా చెప్పే పేరు నాదెండ్ల మనోహర్ దే. మరి అటువంటి నేత కనుక జనసేనకు విడాకులు ఇస్తే ఆ పార్టీ మరింతగా ఇబ్బంది పడుతుందని అంటున్నారు. అయితే పార్టీలో తాను ఉండి కూడా పెద్దగా చేసేది ఏదీ లేనపుడు సైలెంట్ గా తప్పుకోవడమే బెటర్ అని నాదెండ్ల మనోహర్ ఆలోచిస్తున్నారుట. బీజేపీ మీద పవన్ ఆధారపడిన తరువాత పత్రికా ప్రకటనల అవసరం కూడా లేకుండా పోయాక తాను ఉండి ఏం లాభమని ఆయన ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. మరి ఒకవేళ అదే నిజమైతే ఆయన ఏ పార్టీలోకి వస్తారు అన్నది కూడా ఆసక్తికరమైన విషయమే. చూడాలి మరి ఏం జరుగుతుందో