విశాఖ రాజకీయాల వైపు ఇపుడు అందరి చూపు ఉంది. పాలనా రాజధాని అని జగన్ ప్రకటించిన దగ్గర నుంచి విశాఖ మీద అటెన్షన్ ఒక్కసారిగా పెరిగిపోయింది. విశాఖ సిటీని వైసీపీ టార్గెట్ చేసి మరీ తనదైన పాలిటిక్స్ నడుపుతోంది. ఇదిలా ఉంటే విశాఖలో నలుగురు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఏక్ నిరంజన్ అన్నట్లుగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఒక్కరే చంద్రబాబు మాటను శిరసా వహించి పోరాటాలకు వీధుల్లోకి వస్తున్నారు. అమరావతి రైతులకు సంకెళ్ళు వేసిన దాని మీద టీడీపీ రాష్ట్రమంతటా ఆందోళనకు పిలుపు ఇస్తే విశాఖ టీడీపీ తరఫున పాల్గొన్నది ఆయన ఒక్కరే.విశాఖ రాజకీయాల మీద ఒక కన్ను వేసిన చంద్రబాబు ఎప్పటికపుడు అక్కడ పరిణామాలను తమ్ముళ్లను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. విశాఖ టీడీపీకి మూలవిరాట్టు లాంటి ఎంవీవీఎస్ మూర్తికి చెందిన గీతం విద్యా సంస్థల భవనాల మీద సర్కార్ గునపం పడితే ఆందోళన చేయడానికి ఒక్క వెలగపూడే అక్కడకు వచ్చారు. ఇక మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు బండారు సత్యనారాయణమూర్తి కూడా పాలు పంచుకున్నా వారు సిటీకి సంబంధించిన వారు కాదు, పైగా గత ఎన్నికల్లో ఓటమిపాలైన వారు. నాలుగు దిక్కులా నాలుగు స్థంభాలుగా పార్టీకి ఉంటారని టీడీపీ తరఫున గెలిపిస్తే వాసుపల్లి గణేష్ కుమార్ సైకిల్ దిగిపోయారు, ఇక మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్ హాజర్ కావడం అంటే టీడీపీ ఎంతలా చితికిపోయింది అనడానికి అదే ఉదాహరణ అంటున్నారు. దాంతో బాబు మధనపడుతున్నారని కూడా చెబుతున్నారు.విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుకు చంద్రబాబు విజయనగరం జిల్లా టీడీపీ ఇంచార్జి పదవిని కట్టబెట్టారు. కానీ ఆయన కనీసం ఆ పదవి తరువాత ఉలకలేదు, పలకలేదు. తన ఆఫీసు కదలకనే పని తాను చేసుకుంటూ పోతున్నారు. జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా తమ్ముళ్ళు గట్టిగా ఖండించాలని చంద్రబాబు చెప్పినా కూడా సీనియర్ ఎమ్మెల్యే గణబాబు పెదవి విప్పకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అన్నింటికీ మించి మూర్తి గీతం మీద వైసీపీ కత్తులు దూస్తూంటే పరామర్శకు కూడా ముందుకు రాకపోవడంతో గణబాబు రూట్ ఏంటో తమ్ముళ్ళు అర్ధం చేసుకున్నారని అంటున్నారు. చంద్రబాబు సైతం పదవి ఇచ్చినా కదలకపోవడమేంటి అని గుస్సా అవుతున్నారని అంటున్నారు.మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, గణబాబు ఒక్కటే మాటగా ఉంటారని పేరు. ఇద్దరూ కలసి ఒకేసారి టీడీపీ ద్వారా 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో అనకాపల్లి ఎంపీగా గంటా గెలిస్తే పెందుర్తి ఎమ్మెల్యేగా గణబాబు విజయం సాధించారు. ఇక గంటా 2008లో ప్రజారాజ్యంలోకి వెళ్తే గణబాబు కూడా ఆయన వెంట నడిచారు. తిరిగి ఇద్దరూ టీడీపీలోకి 2014 ఎన్నికల ముందు వచ్చి చేరారు. ఇక ఇపుడు గంటా వైసీపీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. మంత్రి పదవి విషయంలో వ్యవహారం ఒక కొలిక్కి వస్తే గంటా జంప్ చేయడం ఖాయమని కూడా అంటున్నారు. ఆయన వెంట గణబాబు కూడా నడుస్తారని చెబుతున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. విశాఖ పశ్చిమలో వైసీపీ బలపడుతోంది. అందువల్ల తాను ఆ పార్టీలో చేరి 2024 నాటికి టికెట్ పొందాలని గణబాబు ఆలోచన చేస్తున్నారుట. ఇక టీడీపీ అధినాయకత్వం విషయంలో కూడా గణబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి గంట గణగణమోగకపోవడంతో చంద్రబాబు తెగ పరేషాన్ అవుతూంటే వారు ఎప్పటికైనా మా గూటికేనని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.