YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఆరోగ్యమస్తు

 ఆరోగ్యమస్తు

 

 జిల్లా వ్యాప్తంగా గర్భిణుల్లో రక్తహీనతతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాలు బయటపడటంతో ఆ గండం దాటించే చర్యలు ఆరంభమయ్యాయి. అదనపు పౌష్టికాహారాన్ని అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. కలెక్టర్‌ ధనంజయరెడ్డి ఆదేశాల మేరకు.. రూ.60 లక్షల అంచనాతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇంతకు ముందు ఇస్తున్నదానికి  అదనంగా అయ్యే ఈ ఖర్చును ప్రభుత్వం భరించే అవకాశాలు ప్రస్తుతం కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, దాతల నుంచి నిధులు సేకరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా కలెక్టర్‌ సూచించారు.

కనీసం  రూ.40 లక్షల వరకయినా ఇలా సమకూర్చుకోగలిగితే మిగిలిన మొత్తాన్ని జిల్లాకు వచ్చే ఇతరత్రా నిధుల నుంచి సమకూర్చాలని భావిస్తున్నారు. కొవ్వాడలో అణువిద్యుత్తు కేంద్రం నిర్మాణానికి ఉపక్రమిస్తున్న కేంద్ర అణువిద్యుత్తు సంస్థ ప్రతినిధులను కూడా సంప్రదించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

గర్భిణుల్లో రక్తహీనత కారణంగా పిల్లల్లో ఎదుగుదల లోపాలు బయట పడిన క్రమంలో... ఆ లోపాన్ని భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. జిల్లా వ్యాప్తంగా 17 వేల మంది గర్భిణుల్లో 10,700 మందికి రక్తహీనత ఉన్నట్లు నిర్దరణ విషయం తెలిసిందే. ఇంతకు ముందే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో.. ముందు అంచనా వేయిస్తే అందుకు అయ్యే నిధులను సమకూరుస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మాటిచ్చింది. తీరా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆరు నెలలకు అయ్యే ఖర్చునే రూ.60లక్షలుగా తేల్చడంతో ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని సూచనప్రాయంగా తేల్చేసినట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నిధులు సమీకరించడానికి ఉన్న అవకాశాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ సూచించినట్లు తెలిసింది. సారవకోటలోని ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. అక్కడక్కడ దాతలు విరాళాలు ప్రకటించారు. ఈ మొత్తం అంతా కలిపినా రూ.85 వేలకే పరిమితం అయింది. కనీసం రూ.40 లక్షల వరకైనా సమకూరిస్తే.. మిగిలిన మొత్తాన్ని తాను ఏదోరకంగా సమకూర్చగలనని కలెక్టర్‌ పేర్కొన్నారు. పారిశ్రామిక సంస్థలతో కూడా మట్లాడాలని ఆ బాధ్యతలను జేసీ-2 రజనీకాంతరావుకు అప్పగించారు.

ఒకటి రెండు రోజుల్లో అణువిద్యుత్తు సంస్థతో శ్రీకాకుళంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. వారి నుంచి భారీ స్థాయిలో నిధులు ఈ కార్యక్రమానికి ఆశిస్తున్నారు. అలా కాదంటే.. కర్మాగార నిర్మాణాన్ని చేపడుతున్న నియోజకవర్గంలోని రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం తదితర ప్రాంతాల్లోని అంగన్‌వాడీ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చువరకైనా సమకూర్చేలా బాధ్యుల్ని చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ.. రాగి, నువ్వుల లడ్డూలతో పాటు ఇతర పౌష్టికాహారాన్ని సమకూర్చే బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 18 అంగన్‌వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్టుల వారీ తయారీ బాధ్యతలు అప్పగించాలా.. జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసే బాధ్యతలను కొందరికే అప్పగించాలా అన్న అంశంపై కూడా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఈ రకమైన లడ్డూల తయారీలో జిల్లాలోని పలు సంఘాలు పేరుగాంచాయి.

Related Posts