YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇప్పుడు మేల్కోని ఏం లాభం..?

ఇప్పుడు మేల్కోని ఏం లాభం..?

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో.. విచ్చలవిడిగా ఆక్వా చెరువులు  తవ్వుకోవడానికి ఇన్నాళ్లూ అనుమతులు ఇచ్చేశారు. అనుమతులు లేకుండా కూడా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిగిపోయాయి. నిబంధనలు పాటించకుండా సాగు చేస్తున్న చెరువులకు లెక్కే లేదు. ఇప్పటివరకు ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా ఆక్వాసాగు చేపడుతూ వచ్చారు. ఒకప్పుడు వేలల్లో ఉండే ఆక్వాసాగు ఏకంగా లక్షల ఎకరాలకు చేరిపోయింది. వరిసాగుకు నీటికొరత ఏర్పడుతుందని గమనించిన అధికారులు ఇప్పుడు ఆక్వా సాగుకు అనుమతులు ఇవ్వడం ఆపేశారు. ఈ నిర్ణయం కొంతముందే తీసుకుని ఉంటే వరిసాగుకు ఇంత గడ్డు పరిస్థితి వచ్చేది కాదని రైతులు పేర్కొంటున్నారు.

జిల్లాలోని డెల్టాప్రాంతంలో 5.29 లక్షల ఎకరాల్లో వరిసాగు యోగ్యమైన భూమి ఉండగా ఈ ఏడాది రబీ సీజనులో 4.16 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని వ్యవసాయాధికారులు లెక్కతేల్చారు. జలవనరుల శాఖాధికారులు 4.60 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్నట్లు లెక్కలు వేసి నీటిని విడుదల చేయడానికి ప్రణాళిక రూపొందించినా.. అంతకంటే తక్కువ సాగు జరుగుతున్నా నీరందక అనేక ప్రాంతాల్లోని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఖరీఫ్‌ సీజనులో ఏదోలా నెట్టుకొస్తున్నా.. రబీ సీజనులో డెల్టాప్రాంతంలో సాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. వరిసాగుకు సరిపడా నీరు అందించలేక పోయారు. కారణం కాలువలకు వచ్చే నీటిని పలుచోట్ల రొయ్యల  చెరువులకు వాడుకోవడమే. 

జిల్లాలో కొన్ని చోట్ల వరికోతలు ప్రారంభమైనా.. ఆలస్యంగా వరినాట్లు వేసిన ప్రాంతాల్లో పంట కీలక దశలో ఉంది. ప్రస్తుతం నీరందకపోతే దిగు  బడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఇటీవల గణపవరం మండలంలోని మొయ్యేరు గ్రామ రైతులు వరిదుబ్బులతో ఆందోళన చేశారు. గత నెలలో అనేక మండలాల రైతులు జాతీయరహదారిపై  రాస్తారోకోలు చేశారు. ఇంత జరిగితేనే గాని అధికారులు అసలు సమస్యను గుర్తించలేదు. సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇప్పుడు  ఆక్వాసాగుకు కొన్ని రోజులుగా అనుమతులు నిలిపివేశారు. ప్రస్తుతం  సాగునీటికి ఎద్దడి ఉందనే సమస్యతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆక్వాసాగుకు అనుకూలమైన భూమి అవునా కాదా..అనే దానితో సంబంధం లేకుండా అనుమతులు ఇచ్చేశారు. నిబంధనలు ప్రకారం   సాగుకు అనుకూలమైన భూమి కాదు అని గుర్తిస్తేనే అనుమతులు ఇవ్వాలి. అసలు అలాంటి నిబంధన ఒకటి ఉందని పట్టించుకున్న నాథుడే లేదు. దరఖాస్తు చేసుకున్నారా.. లేదా అనేదే పరమావధిగా అనుమతులు ఇచ్చేశారు. ఎకరంలో 40 బస్తాలు ధాన్యం పండిన భూములు సైతం చెరువులుగా మారిపోయాయి. ఉండి, ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంటుంది. వరి బంగారంలా పండే పొలాల పక్కనే ఆక్వా చెరువులు దర్శనమిస్తుంటాయి. పక్క రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాల్సిన కార్యక్రమం ఎప్పుడో కొండెక్కిపోయింది. ఆక్వాసాగుకు దరఖాస్తు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే అధికారులు సైతం మండలాల్లో అనేక మంది ఉన్నారు. ఈ దరఖాస్తులు వస్తేనే ఎంతోకొంత అనధికార ఆదాయం వస్తుంది. ఎకరానికి అనుమతి ఇవ్వాలంటే రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేసేవారు.  దాంతోనే సాగుకు అనుకూలమా? ప్రతికూలమా అనేది చూడకుండా అభ్యంతరాల మాట పట్టించుకోకుండా అనుమతులు జారీ చేసేశారు. ఇవి కాకుండా అనుమతులు లేకుండా సాగు చేస్తున్నవి చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటికి రిజిస్ట్రేషను చేయించుకోవాలంటూ మత్స్యశాఖాధికారులు మరో అవకాశం ఇచ్చారు.

రబీలో నీటి కష్టాలు ఈ సంవత్సరమే కాదు. గత కొన్నేళ్లనుంచి రబీలో సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కూడా సాగునీటి విషయమై తగాదాలు జరిగాయి. తమ పొలాలకు రావాల్సిన నీటిని ఆక్వాసాగుదారులు తస్కరిస్తున్నారంటూ పాలకోడేరు మండలం రైతులు ఆందోళన చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టిసారించి ఆ సమస్యను కొంతవరకు పరిష్కరించారు. అధికారులు ఇంకాస్త ముందే దృష్టిసారించి ఉంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చేది కాదనేది  రైతుల ఆవేదన.

Related Posts