అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మిరెడ్డి సీపీఐ మండల కార్యదర్శి బసాపురం గోపాల్ పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా సోమవారం విరుపాపురం గ్రామంలో కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పంటల దిగుబడి బాగా వస్తున్న సమయంలో వర్షాలు ఎక్కువ కురవడంతో పత్తికాయలు కుళ్లిపోయి ,మెరప పంటకు తెగలు వచ్చి ,వేరుశెనగల్లో నూనెశాతం తగ్గిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం వెంటనే పంట నష్ట పరిహారం అంచనావేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు . అదేవిధంగా 2018-2019 పంట నష్టపరిహారం 658 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని వారు కోరారు.పత్తి పంటకు క్వింటానికి 7 వేలు చొప్పున మార్కెట్ లో మద్దతు ధర ఇవ్వాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు నరసప్ప సీపిఐ మండల సహాయ కార్యదర్శి శివరామ్ తదితరులు పాల్గొన్నారు.