సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు లో భాగంగా ఈనెల 7 నుండి 15 వరకు జరుగుతున్న రాజకీయ చైతన్య జాతా 3వ రోజ కాకినాడ నగరంలో పలుచోట్ల ప్రచార జాత కార్యక్రమం నిర్వహించారు. నాగమల్లి తోట జంక్షన్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు పూలమాల వేసి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ .అజయ్ కుమార్ మాట్లాడుతూ బిజెపి విధ్వంసక పాలన వలన దేశ లౌకిక వాదానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించి రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన జిఎస్టి సొమ్ము కేంద్రం ఇవ్వక పోయినా మన సొమ్ము మనకి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని అధికారపార్టీ వైసిపి, ప్రతిపక్షం టిడిపి, జనసేన పార్టీలు ప్రశ్నించలేకపోతున్నాయని విమర్శించారు.రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన రైతుల మనుగడ ప్రశ్నార్థకంగా ఉందన్నారు. విద్యుత్ చట్ట సవరణలతో సబ్సిడీలు ఎత్తి వేసే ప్రక్రియకు జగన్ ప్రభుత్వం ముందుందన్నారు. ఈ కార్యక్రమానికి సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు మద్దతు తెలియజేసి మాట్లాడారు. అనంతరం సిపిఎం ప్రజాచైతన్య యాత్ర., రమణయ్యపేట , వలసపాకలు, వాకలపూడి గ్రామాలలో కొనసాగింది.