మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇవాళ ఉదయం ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఈరోజు నుంచి ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించాల్సి ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ తేలినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చిరంజీవి సూచించారు. కాగా చిరంజీవికి పాల్తూరు నిర్ధారణ కావడంతో టీఆర్ఎస్ నేతల్లో గుబులు పట్టుకుంది. ఎందుకంటే రెండు రోజుల కిందట చిరంజీవి.. హైదరాబాద్ వరద బాధితులకు విరాళం అందించేందుకు గాను అక్కినేని నాగార్జునతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ని కలిశారు. రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ తో వారు భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు కూడా మీడియాకు విడుదల చేయగా అందులో చిరంజీవి గానీ కేసీ ఆర్ గానీ నాగార్జున కానీ మాస్కు ధరించలేదు. దీంతో వారు కూడా ముందస్తు జాగ్రత్తగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధపడుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ భేటీలో పాల్గొన్న టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కరోనా టెస్ట్ చేయించుకోగా ఆయనకి నెగటివ్ అని తేలింది. సీఎం కేసీఆర్ కూడా కరోనా టెస్ట్ చేయించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా నాలుగు రోజుల కిందట సింగర్ రఘు కుంచె కుమార్తె వివాహం జరుగగా ఆ వేడుకల్లో కూడా చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. ఆ వేడుకల్లోనే చిరంజీవికి వైరస్ సోకి ఉండవచ్చని అంటున్నారు