కదిరి వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్నారా? ఇక్కడ ప్రధాన సామాజికవర్గానికి దూరమవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. కదిరి తొలి నుంచి వైసీపీకి పట్టున్న నియోజకవర్గం. పేరుకు అనంతపురం జిల్లాలో ఉన్నప్పటికీ పులివెందుల నియోజకవర్గాన్ని ఆనుకుని ఉండటంతో కదిరి నియోజకవర్గంపై వైసీపీ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తొలి నుంచి అంచనా.గత ఎన్నికల్లోనూ అదే జరిగింది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చాంద్ బాషా టీడీపీ అభ్యర్ది కందికుంట వెంకటప్రసాద్ పై విజయం సాధించారు. కందికుంట వెంకటప్రసాద్ 2009లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. అయితే చాంద్ భాషా అప్పట్లో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు టీడీపీ లో చేరిపోయారు. చివరకు 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం చాంద్ భాషాను పక్కన పెట్టి చివరకు కందికుంట వెంకటప్రసాద్ కే టిక్కెట్ కేటాయించింది.అయితే గత ఎన్నికల్లో చాంద్ భాషా, కందికుంట వెంకటప్రసాద్ కలసి పనిచేసినా ఫలితం లేకుండా పోయింది. వైసీపీ ఎమ్మెల్యేగా సిద్ధారెడ్డి గెలుపొందారు. చాంద్ భాషా పార్టీని విడిచి వెళ్లిపోగానే అక్కడ ఇన్ ఛార్జిగా జగన్ సిద్ధారెడ్డిని నియమించారు. సహజంగానే పులివెందుల ప్రభావం పడి 2019 ఎన్నికల్లో సిద్దారెడ్డి గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి రావడంతో మైనారిటీ సోదరులు తమ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుందని భావించారు.కానీ ఒక సామాజికవర్గానికి చెందిన ఆస్తుల విషయంలో స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ విమర్శలు విన్పిస్తున్నాయి. చాంద్ భాషా మీద ఉన్న ఆగ్రహం తమపై చూపిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డికి సొంత పార్టీలో కాకపోయినా నియోజకవర్గంలో ఒక బలమైన సామాజికవర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. మరి దీని నుంచి ఎమ్మెల్యే ఎలా బయటపడతారో చూడాలి.