రెడ్డి, కమ్మ, బీసీ సామాజిక వర్గాల డామినేషన్ ఎక్కువగా ఉన్న ( పార్టీలో ) నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబు.. మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ అజీజ్‌ను చేరదీయడం.. కీలకమైన పార్లమెంటరీ పార్టీ చీఫ్ పదవిని కట్టబెట్టడం కలకలంగా మారింది. ఇప్పటి వరకు జిల్లాలో మైనార్టీలకు ఇంత కీలక పదవిని పార్టీ ఏనాడు ఇచ్చిన దాఖలాలేదు. గతంలో ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు హయాంలో కూడా ఇక్కడ రెడ్లకే పెత్తనం అప్పగించేవారు. మెట్ట ప్రాంతం వరకు కమ్మ నేతలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవారు. ఈ సారి మాత్రం అన్ని రెడ్లు, కమ్మలు, బీసీలను కాదని మైనార్టీ నేతకు పార్టీ చీఫ్ పదవి ఇచ్చారు. బీద రవిచంద్రయాదవ్ వంటి కీలకమైన నాయకుడు ఇంచార్జ్‌గా ఉన్న జిల్లాలో ఆయన మాట కాదని చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా నేతల్లో చర్చనీయాంశంగా మారిందివాస్తవానికి పార్టీ పార్లమెంటరీ పగ్గాలను మాజీ మంత్రి నారాయణ.. తన వర్గంగా ఉన్న వేమిరెడ్డి పట్టాభిరెడ్డికి ఇప్పించుకునేందుకు ప్రయత్నించారని టాక్ ఉంది. అంటే..ఇప్పటి వరకు ఉన్న బీద హవాకు బ్రేకులు వేయాలని నారాయణ ప్రయత్నించారు. అదే సమయంలో ఈ పదవిని బీద తనకే దక్కించుకునేందుకు ప్రయత్నించారని స్థానికంగా ప్రచారంలో ఉంది. తనకు కాని పక్షంలో బీసీల్లోనే తమ వర్గం నేతకు ఈ పదవి ఇవ్వాలని ఆయన బాబుకే కండీషన్ పెట్టారు. అయితే, వీరిద్దరికీ కాకుండా అప్పటి వరకు కనీసం పరిశీలనలో కూడా లేని అబ్దుల్ అజీజ్‌కు నెల్లూరు పార్లమెంటరీపార్టీ పగ్గాలను అప్పగించారు చంద్ర బాబు.అయితే దీని వెనక చంద్రబాబు చాలా పెద్ద కసరత్తే చేశారట. బీద రవిచంద్ర యాదవ్ కు దూకుడు ఎక్కువని పేరు. ఆయన బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్డి నేతలను, కమ్మసామాజిక వర్గానికి చెందిన నేతలను విస్మరిస్తున్నారన్న పేరుతోపాటు ఒంటెత్తు పోకడలతో పార్టీని లైన్‌లో పెట్టలేకపోయారని, ఆయన కారణంగానే ఆనం రామనారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి వారు గత ఎన్నికలకు ముందు పార్టీ మారారనే పేరుంది. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రెండు ఎన్నికల్లోనూ పార్టీ జిల్లాలో ఘోరంగా ఓడింది. గత ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఓటమే. దీంతో ఆయనపై చంద్రబాబు ఒకింత గుస్సాగానే ఉన్నారు. ఇక, ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి.. కమ్మ నేతల చేతుల్లో ఉన్నాయి. అయినా కూడా బీద వీరికి ఏ మాత్రం పట్టించుకోకుండా.. తన సొంత అజెండా అమలు చేస్తున్నారనే ఆగ్రహం కూడా బాబుకు ఉంది.ఈ నేపథ్యంలోనే బీదను రాష్ట్ర పార్టీ కమిటీలోకి తీసుకున్నా జిల్లాలో మాత్రం ఆయన వర్గానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక, మంత్రి నారాయణ విషయానికి వస్తే.. ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎటు వెళ్తే.. అటు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారంలో ఉంది. దీంతో చంద్రబాబు ఈయనను కూడా పక్కన పెట్టి.. ఆయన సిఫారసు చేసిన వారి పేరును అసలు ప్రయార్టీలోకే తీసుకోలేదు. ఇక సోమిరెడ్డి ఏనాడు చంద్రబాబు మాట జవదాటే పరిస్థితి లేదు. ఏదేమైనా బీద, నారాయణ తీరుతో ఈ ఇద్దరు నేతలకు తగిన విధంగా లెస్సన్ చెప్పాలనే నిర్ణయంలో భాగంగా మైనార్టీ వర్గానికి పెద్దపీట వేశారని అంటున్నారు టీడీపీ నేతలు.