కమ్యూనిస్టులు అంటే ఆ రేంజ్ వేరు. ప్రభుత్వంలో ఎవరున్నా.. అధికారం ఎవరిదైనా.. వారికి జాన్తానై.. ప్రజల సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైనే ఫోకస్ పెడతారు. ఈ క్రమంలో జైళ్లకు వెళ్లేందుకు కూడా వెనుకాడరు. ఇది ఆది నుంచి మనం చూస్తున్నదే. అయితే, రాను రాను కమ్యూనిస్టులు కూడా మారిపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కమ్యూనిస్టు నాయకుల తీరు మారడంతో ప్రజల్లో వారు పలచన అవ్వడంతో పాటు వారికి అక్కడక్కడా ఉన్న సానుభూతిపరులు కూడా కనపడని పరిస్థితి. అవినీతి, అక్రమాలకు కూడా కామ్రెడ్లు కేరాఫ్‌గా మారారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇక, అధికార పార్టీలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారనే వాదనలు కూడా తరచుగా వినిపిస్తున్నాయి. ఇలాంటివాదనే ఒకటి ఏపీలో తెరమీదికి వచ్చింది.రాష్ట్రంలో ప్రభుత్వం వ్యతిరేక విదానాలపై ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తోంది. అమరావతి రాజధాని తరలింపు, జగన్ న్యాయవ్యవస్థపై పోరాటం, పోలవరం విషయంలో ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు, దళితులపై దాడులు, కరోనాను సరైన రీతిలో ఎదుర్కొనలేక పోవడం ఇలా.. అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రజలతో కలిసి పోరాటాలకు సిద్ధమవుతామని టీడీపీ చెబుతోంది. పోరాటాలకు దిగుతోంది. కానీ, ఇదే సమయంలో ప్రజలకు నిత్యం అండగా ఉంటామనే సంకల్పం చెప్పుకొన్న కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు? అనేది కీలక ప్రశ్న.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైసీపీ ప్రభుత్వం అమలు చేసే విధానాల్లో తప్పులపై బాగానే ఎదురు దాడి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కానీ, అదే సమయంలో కీలకమైన సీపీఎం మాత్రం సైలెంట్‌గా ఉంటోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి.. పిన్నెల్లి మధు సైలెంట్‌గా ఉంటున్నారు. జగన్‌పై ఒక్కమాట అనడం లేదు. ప్రభత్వంపైనా ఎలాంటి విమర్శలు చేయకపోగా.. రాజధాని అంశం .. అసలు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పోలవరం విషయాన్ని, ముంపు ప్రభావిత ప్రజల అంశాన్ని కూడా ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో మధు ఏమైనా.. జగన్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారా ? అనే సందేహాలు వ్యక్తం కావడం గమనార్హం.కొద్ది నెలల క్రితం ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు సీఎం జగన్, సజ్జల రామకృష్ణా రెడ్డి మధు నివాసానికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత ఏమైందో కాని ఆయన ప్రభుత్వం విషయంలో సైలెంట్ అయిపోయారు. నిజానికి కమ్యూనిస్టుల్లో పార్టీ సిద్ధాంతానికే ప్రాధాన్యం ఉంటుంది. వ్యక్తుల అభిప్రాయాలకు విలువ ఉండదు. ఇప్పుడు సీపీఎంలో మధు అభిప్రాయానికే పార్టీ విలువ ఇస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక. పార్టీనే ఇలా నిర్ణయించుకుందా ? అనే సందేహాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. ఏదేమైనా.. సీపీఎం వైఖరిపై తీవ్ర సందేహాలు వ్యక్తం కావడం.. కామ్రేడ్లు జగన్‌తో లోపాయికారీ.. ఒప్పందాలు చేసుకున్నారా ? అనే సందేహాలు రావడం కలకలం రేపుతుండడం గమనార్హం. మరి దీనిపై మధు స్పందిస్తారో లేదో ? చూడాలి.