రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద 2434 వైద్య ప్రక్రియలకు చికిత్సలు ప్రారంభం అయ్యాయి. మంగళవారం నాడు తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆరోగ్యశ్రీ వైద్య సేవల విస్తరణను ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ అన్ని రకాల కాన్సర్ చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. హైదరాబాద్, బెంగళూరులోనూ ఆరోగ్యశ్రీ చికిత్సలు అందిస్తున్నాం. ఇప్పటికే 7 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్య ప్రక్రియలకు చికిత్స అందిస్తున్నాం. మరో 6 జిల్లాలో నేటి నుంచి 2434 వైద్య ప్రక్రియలకు చికిత్స ప్రారంభిస్తున్నామని అన్నారు.
వైద్యం ఖర్చు రూ. 1000 దాటిన ప్రతి చికిత్స ఆరోగ్య శ్రీలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నాం. బోన్ మారో ట్రాన్స ప్లాన్టేషన్ కూడా ఆరోగ్య శ్రీలోకి తీసుకువచ్చాం. అన్ని రకాల వైద్య చికిత్సలు ప్రతి ఆస్పత్రిలో నాణ్యతతో చేసేలా చర్యలు తీసుకున్నాం. క్యూఆర్ కోడుతో కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల జారీ చేస్తున్నాం. ఏ ఆస్పత్రికి వెళ్లినా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు వివరాలు వస్తాయి. మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చిత్తశుద్ది తో అడుగులు ముందుకు వేశామని అన్నారు.
నాడు నేడులో ఆస్పత్రుల రూపురేఖలు మార్చుతున్నాం . గ్రామ వార్డు సచివాలయాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్కులు ఏర్పాటు చేస్తున్నాం. 560 అర్బన్ క్లినిక్కులు 1147 పీహెచ్సీ కేంద్రాలు రూపు రేఖలు మార్చుతున్నాం. 52 ఏరియా 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అభివృద్ది చేస్తున్నాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ , నర్సింగ్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు,
మరో 16 కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 3 క్యాన్సర్, 2 కిడ్నీ, గిరిజనుల కోసం 6 మల్టీ స్పెషాలిటీ అస్పత్తృులు నిర్మిస్తున్నాం. 1088 కొత్త 104/108 వాహనాలను ప్రారంభించాం. ప్రతి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ఉంచేందుకు 9712 మంది వైద్య సిబ్బందిని నియమించామని అన్నారు.
వైద్య సిబ్బంది ఎక్కడ కొరత ఉన్నా వెంటనే నియామకం చేపట్టాలని ఆదేశించాం. 2 వేల జనాభా ఉన్న గ్రామాల్లో 24 గంటల్లో వైద్య సదుపాయాలు అందించే ఏర్పాటు చేశాం. ప్రతి అడుగునూ వ్యవస్థను బాగు పరిచేలా ముందుకు వేస్తున్నామని అన్నారు.
ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాక ఆరోగ్య ఆసరా కింద పింఛన్లు ఇస్తున్నాం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతోన్న వారికి రూ. 3 వేల నుంచి రూ. 10 వేల వరకు పెన్షన్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ ట్రీట్ మెంటును ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని సీఎం అన్నారు