రాజకీయాల్లో ఎవరు మెత్తగా ఉంటే వారిపై ఎక్కేయడం సీనియర్లకు అలవాటే. అయితే, అది గతంలో ప్రత్యర్థి పార్టీల నేతలపై ఎక్కువగా ఉండేది. అయితే, ఇప్పుడు వ్యూహాలు మారిపోయి.. సొంత పార్టీలోనే ఈ తరహా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏమాత్రం మెతకగా ఉన్నప్పటికీ.. వెంటనే ఆయన భుజాలపైకి ఎక్కేయడం.. తొక్కేయడం అనే ఫార్ములా అమలయిపోతోంది. మరీముఖ్యంగా వైసీపీకి కీలక గణం ఉన్న చిత్తూరులో మెతక వైఖరితో ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులే తొక్కేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. సత్యవేడు నియోజకవర్గం.ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం విజయం సాధించారు. అది కూడా జిల్లాలోనే టీడీపీ అధినేత చంద్రబాబును మించిన మెజారిటీ 50 వేల ఓట్లతో సత్తా చూపించారు. వాస్తవానికి 2014లో కోనేటి వోడిపోయినా గత ఏడాది తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. ఇటు పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో ఇంకేముంది.. నియోజకవర్గంలో తన సత్తా చూపించాలని అనుకున్నారు. మంత్రులకే సాధ్యం కాని మెజార్టీ సొంతం చేసుకున్నవారు ఆ మాత్రం అనుకుంటే తప్పులేదు. అయితే.. కార్యాచరణలోకి వచ్చే సరికి మాత్రం ఇది అంత సులువు కాకపోగా.. ఎమ్మెల్యేనే డమ్మీ అయిపోయే పరిస్థితి వచ్చేసింది.నియోజకవర్గంలో ఆదిమూలంను పట్టించుకునేవారు కరువయ్యారు. ఆయన వద్దకు వచ్చి.. మాట్లాడే కేడర్ కూడా కనిపించడం లేదు. అధికారులకు ఎమ్మెల్యే చాలా లైట్ అయిపోయారట. మరి ఏం జరుగుతున్నట్టు? అంటారా? జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు.. అంతా తామే అయి.. ఇక్కడ కార్యక్రమాలను కూడా చక్కబెడుతుండడం నియోజకవర్గంలో పార్టీ, ఇతర పెత్తనాల మొత్తాన్ని చెరిసగం పంచేసుకోవడంతో ఇక్కడి పార్టీ కార్యకర్తల నుంచి ప్రజల వరకు కూడా ఎమ్మెల్యేను పట్టించుకోవడం లేదని అంటున్నారు. పైగా మంత్రి నారాయణ స్వామికి, పెద్దిరెడ్డికి నియోజకవర్గంపై పట్టు ఉండడంతో ఎమ్మెల్యే ఆదిమూలం పరిస్థితి దారుణంగా తయారైందనే టాక్ వినిపిస్తోంది.గతంలో నారాయణ స్వామి ఇక్కడనుంచి గెలుపు గుర్రం ఎక్కారు దీంతో సత్యవేడు నియోజకవర్గంలో ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఆయన ఈ నియోజకవర్గంలో మూడుసార్లు పోటీ చేశారు. గత ఎన్నికల్లోనే నారాయణ స్వామి.. ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అంటే.. ఏరేంజ్‌లో నారాయణ స్వామి సత్యవేడుపై కన్నేశారో తెలుస్తుంది. అదే సమయంలో పెద్దిరెడ్డి కూడా ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. సహజంగానే జిల్లా మొత్తానికి ఆయనే పెద్దగా ఉండడంతో సత్యవేడులో మరింత దూకుడు పెంచారనేది టాక్.. మొత్తానికి ఈ ఇద్దరు మంత్రుల కారణంగా.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిమూలం పరిస్థితి దయనీయంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.